Entrance Tests: After Inter, JEE is not the only one.. also write these entrance exams..!
Entrance Tests: ఇంటర్ తర్వాత జేఈఈ ఒక్కటే కాదు.. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయండి..!
Entrance Tests: ఇంజనీరింగ్ అంటే జేఈఈ, ఐఐటీలే కాదు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా చదవచ్చు. కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాయి.
మనదేశంలో టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా IIT, NITలకు గుర్తింపు ఉంది. ఈ సంస్థల్లో అడ్మిషన్స్ సొంతం చేసుకోవాలంటే JEE ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రవేశ పరీక్ష చాలా కఠినమైనది. పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే చాలా తక్కువ మంది విద్యార్థులు క్వాలిఫై అవుతుంటారు. అయితే ఇంజనీరింగ్ అంటే జేఈఈ, ఐఐటీలే కాదు, ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా చదవచ్చు. కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ ఇంజనీరింగ్ కాకుండా ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తాయి. ఇంటర్ తర్వాత విద్యార్థులు రాయాల్సిన కొన్ని ప్రతిష్టాత్మక ఎంట్రన్స్ టెస్టులు ఏవో పరిశీలిద్దాం.
టీఎస్ ఎంసెట్:
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS EAMCET) ద్వారా తెలంగాణలోని ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో యూజీ కోర్సులకు అడ్మిషన్స్ కల్పిస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి చివరి నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు కొనసాగుతుంది. మేలో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
ఏపీ ఈఏపీసెట్:
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(AP EAPCET)ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్వంలో జేఎన్‌టీయూ-కాకినాడ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను క్లియర్ చేస్తే ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. మేలో ఎగ్జామ్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉంటుంది.
బిట్‌శాట్:
జేఈఈ ఎంట్రన్స్ టెస్ట్ తరువాత ప్రాముఖ్యత ఉన్న ఇంజనీరింగ్ ఎంట్రన్స్ బిట్‌శాట్. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) ఇన్‌స్టిట్యూట్ BITSAT (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)ను నిర్వహిస్తుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్ బిట్స్ క్యాంపస్‌ల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ కల్పిస్తారు. మే, జూన్ నెలల్లో ఎగ్జామ్ జరుగుతుంది.
UGEE ఎంట్రన్స్ టెస్ట్:
ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్(IIIT-HYD)లో ప్రవేశాల కోసం అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(UGEE) నిర్వహిస్తారు. UGEE టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ వరకు అవకాశం ఉంటుంది. మేలో ఎగ్జామ్ జరుగుతుంది. నేషనల్ అసెస్‌మెంట్ & అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC)గ్రేడ్ Aను ఈ ఇన్‌స్టిట్యూట్ సొంతం చేసుకుంది. IIIT-హైదరాబాద్ ఇంజనీరింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI):
మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఐఎస్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌లో చేరవచ్చు. అయితే ఎంట్రన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ రెండో వారం మధ్య జరుగుతుంది. మేలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు.
COMEDK UGET:
అసోసియేషన్ ఆఫ్ కర్నాటక మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజస్ యూజీఈటీ (COMEDK UGET) ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కర్ణాటకలోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ ప్రకియ వ్యవధి ఉంటుంది. మేలో ఎగ్జామ్ నిర్వహిస్తారు.
వెస్ట్ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (WBJEE):
పశ్చిమ బెంగాల్‌లోని బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్స్ పొందాలంటే WBJEE ఎంట్రన్స్ టెస్ట్‌ను క్లియర్ చేయాలి. ఈ పరీక్ష కోసం దరఖాస్తు వ్యవధి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అవకాశం ఉంటుంది. పరీక్ష ఏప్రిల్, మే మధ్యలో జరుగుతుంది.