Crores revenue from water bottles
IRCTC: వాటర్ బాటిళ్లతో కోట్ల ఆదాయం.. ఐఆర్సీటీసీకి కలిసొచ్చిన కొత్త బిజినెస్
ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ రైల్ నీర్ పేరుతో సొంత బ్రాండ్ ను ప్రారంభించింది. రైలు ప్రయాణికులకు స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా మొదలైన ఈ బిజినెస్ దినదినాభివృద్ధి చెందుతోంది. చూస్తుండగానే ఈ సంస్థకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిపెడుతోంది. ప్రయాణికులకు లీటర్ వాటర్ బాటిల్ ను రూ.15కే అందుబాటులో ఉంచింది. రైల్ నీర్ పేరుతో వీటి అమ్మకాలు చేపట్టింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్సీటీసీ) కి ప్రస్తుతం ఇదో మంచి ఆదాయ వనరుగా మారింది. దీని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. రోజుకు 14 లక్షల రైల్ నీర్ బాటిళ్లను ఉత్పత్తి చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూప 39.5 కోట్ల విలువైన బాటిళ్లను ఉత్పత్తి చేసింది. అంటే ప్రతిరోజూ దాదాపు 10. 82 లక్షల యూనిట్ల వాటర్ బాటిళ్లను అమ్ముతోంది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం వాటర్ బాటిళ్లను మాత్రమే అమ్మి రూ.29.22 కోట్లను ఆర్జించి రికార్డు క్రియేట్ చేసింది.
రైల్ నీర్ ఎక్కడ తయారు చేస్తారు..?
ఐఆర్ సీటీసీకి మొత్తం 16 ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో 4 ప్లాంట్లను సొంతంగా నిర్వహిస్తోంది. 12 ప్లాంట్లను పీపీపీ మోడల్ లో నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంట్లు నంగ్లోయి, దానాపూర్, పాలూర్, అంబర్నాథ్, అమేథి, పర్సాల, బిలాస్పూర్, సనంద్, హావూర్, మందిదీప్, నాగ్పూర్, జాగిరోడ్, మనేర్, సంక్రైల వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో అమేథి, పర్సాల, నాగ్‌పూర్, సనంద్, హాపూర్, మందిదీప్, జాగిరోడ్, మనేర్ మరియు సంక్రైల్ ప్లాంట్లు పీపీపీ మోడల్ కింద నిర్వహించబడుతున్నాయి.
లాభం ఎంతొచ్చిందంటే..
తాజా నివేదికల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మొత్తం 395 మిలియన్ బాటిళ్ల నీటిని ఉత్పత్తి చేసింది. గత ఏడు సంవత్సరాలలో వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. 2003లో రైలు ప్రయాణీకుల కోసం బ్రాండెడ్ ప్యాకేజ్డ్ తాగునీటిని అందించేందుకు రైల్ నీర్ ను ప్రారంభించింది. రైల్ నీర్‌ను అత్యాధునిక ప్లాంట్‌లో ప్రాసెస్ చేస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ప్లాంట్, ఇక్కడ ఏ దశలోనూ నీటిని చేతులు తాకవు. ఉత్పత్తి సమయంలో అధిక నాణ్యతను నిర్ధారించడానికి మొత్తం ప్రక్రియ ఐఆర్సీటీసీ నియంత్రణ, పర్యవేక్షణలో ఉంటుంది.