He gave free meals to lakhs of children so that no one should sleep with an empty stomach
ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో పడుకోవద్దని.. లక్షల మంది పిల్లలకు ఉచితంగా భోజనం పెట్టాడు.
Inspirational News : దేవుడు ఎక్కడో ఉండడు. మన మధ్యే ఉంటాడు. మనిషిగానే ఉంటాడు. మనిషిలోనే ఉంటాడు. అందుకే.. మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు. అందుకే కొందరు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటారు. తామున్నాం అంటూ ఆపన్న హస్తం అందిస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తాడు ఈ యువకుడు. అతడి పేరు నిలయ్ అగర్వాల్. సోషల్ వర్కర్. ఎప్పుడూ సమాజానికి ఏదో ఒకటి చేయాలని పరితపించే వ్యక్తి. 2018 లో తన క్లోజ్ ఫ్రెండ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అసలు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చింది.
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని తెలుసుకున్నాడు.అందుకే విశాలాక్షి అనే ఫౌండేషన్ ను స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఫ్రెండ్ పేరుతో పేదలకు సాయం చేస్తున్నాడు. ఆకలితో ఉండేవాళ్లకు అన్నం పెట్టి ఆదుకుంటున్నాడు. ప్రతి రోజు దేశంలో 7000 మంది ఆకలితో అలమటిస్తున్నారట. వాళ్లకు తినడానికి రోజుకు కనీసం ఒక్క పూట కూడా తిండి దొరకడం లేదట. ఆ 7000 మందిలో 3000 మంది చిన్నపిల్లలే. పెద్దలు అంటే తిండి లేకున్నా ఎలాగోలా బతకగలరు. కానీ.. చిన్నపిల్లల సంగతి ఏంటి. వాళ్లు ఆకలితో అలమటించాల్సిందేనా. వాళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోరు.
ఆరోగ్యంగా ఉండటం, పౌష్ఠికాహారం తినడం అనేది చిన్నపిల్లల హక్కు. అందుకే.. ఇక నుంచి ఏ పిల్లాడు కూడా ఆకలితో అలమటించకూడదని.. ఢిల్లీలో రోడ్ల మీద ఉండే అనాథ పిల్లల కడుపు నింపుతున్నాడు నిలయ్. అలా.. ఇప్పుడు న్యూఢిల్లీ, రాంచి, లక్నో, వారణాసి, పుల్వామా, సిమ్ దెగా అలాంటి ప్రాంతాల్లో ప్రతి రోజు 10 వేల మంది పిల్లల కడుపు నింపుతున్నాడు. ఈ మిషన్ లో 1500 మంది యువతీయువకులు భాగం అయ్యారు. అలా ఇప్పటి వరకు 10 లక్షల మంది కడుపు నింపాడు నిలయ్. ఇంకా ఆకలితో అలమటించే ప్రతి ఒక్కరి కడుపు నింపడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు నిలయ్.