Saree causing cancer..? Is the health of Indian women in danger.. What do doctors say?
చీర క్యాన్సర్‌కు కారణమవుతోందా..? భారతీయ మహిళల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా.. వైద్యులు ఏమంటున్నారంటే
భారతీయులను ప్రపంచంలో భిన్నంగా చూపించేది సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు అని చెప్పవచ్చు. భారతీయ స్త్రీత్వానికి అత్యుత్తమ చిహ్నం చీర. భారతీయ మహిళల వస్త్రధారణలో అత్యధిక భాగాన్ని ఆక్రమించిన చీర ఐదున్నర నుండి ఆరు మీటర్ల వరకు విస్తరించి ఉన్న ఒక అందమైన వస్త్రం.. ప్రపంచవ్యాప్తంగా ప్రియమైనది. కొత్త ట్రెండీ బట్టలు ఎన్ని వచ్చినా.. చీరలకు ఉన్న గిరాకీ ఏ మాత్రం తగ్గలేదు. పండగలు, పర్వదినాలు వస్తే చాలు మగువ మనసు చీరనే కోరుకుంటుంది. అయితే చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో సహా అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయట. ముంబైలోని ఆర్‌ఎన్ కూపర్ హాస్పిటల్‌లో 68 ఏళ్ల మహిళకు ఇటీవల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది చాలా ఆందోళన కలిగించింది . ఇంతకీ చీర క్యాన్సర్ అంటే ఏమిటి? చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా? చీరలకు క్యాన్సర్‌కి సంబంధం ఏమిటి? అటువంటి చాలా గందరగోళ ప్రశ్నకు సమాధానాన్ని ఈ రోజు తెలుసుకుందాం..
చీర క్యాన్సర్ అంటే ఏమిటి?
చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్. ఇది చీర ధరించే స్త్రీలలో నడుము పొడవునా వస్తుంది. చీర కట్టుకునే వారికే కాదు బిగుతుగా ఉండే బట్టలు ధరించే వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చీర కట్టుకునే ముందు లోపల లంగా ధరిస్తారు. ఎక్కువ సేపు నడుము చుట్టూ లంగాను గట్టిగా ధరించడం వల్ల అరుదైన స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిఎన్‌ఎకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢిల్లీలోని పిఎస్‌ఆర్‌ఐ ఆసుపత్రి క్యాన్సర్ విభాగానికి చెందిన డాక్టర్ వివేక్ గుప్తా చెప్పిన ప్రకారం, “భారతదేశంలో, సంవత్సరాలుగా చీరలు ధరించే మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టైట్ గా లంగా వేసుకోవడం వలన నడుము భాగంలో దురద మొదలై.. రోజు గడుస్తున్న కొద్దీ నడుము చుట్టూ ఉన్న చర్మం ఊడిపోవడం మొదలవుతుంది. ఈ లక్షణాలను నార్మల్ గా పట్టించుకోకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.
చీర క్యాన్సర్ వ్యాప్తికి వస్త్రం కంటే పరిశుభ్రత పద్ధతులే ఎక్కువగా కారణమని చెప్పవచ్చు. బీహార్, జార్ఖండ్ వంటి అధిక ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు ఉన్న ప్రాంతాలు ఈ క్యాన్సర్ సంభవనీయత ఎక్కువ అని చెబుతున్నారు. భారతీయ మహిళల్లో 1 శాతం ఈ చీర క్యాన్సర్ ఉన్నాయి. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ వంటి సంస్థలలో ఇప్పటికే పరిశోధనలను జరుపుతున్నారు.
అదేవిధంగా చాలా టైట్ ఫిట్ జీన్స్ పురుషుల్లో క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. నిజానికి గంటల తరబడి చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పరిశోధన ప్రకారం జీన్స్ పురుషులలో పొత్తికడుపు కింది భాగంలో ఉష్ణోగ్రతను పెంచుతుందని.. ఇది స్పెర్మ్ కౌంట్ ను తగ్గించి వృషణాల క్యాన్సర్ (టెస్టిక్యూలర్ క్యాన్సర్)కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
చీరల వంటి సాంప్రదాయ వస్త్రధారణ , సాంస్కృతిక పద్ధతులు సౌకర్యాన్ని , సౌందర్యాన్ని, ఆకర్షణను అందిస్తాయి. అయితే అందమైన దుస్తుల ఎంపికలతో పాటు ఆరోగ్య ప్రభావాల గురించి అవగాహన కూడా అవసరం అని చెబుతున్నారు.