MLC ELECTIONS CODE - William naik

Mobile Menu

Top Ads

More News

logoblog

MLC ELECTIONS CODE

25_02

MLC ELECTIONS CODE

రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తున్నారా? - అయితే మీ డబ్బులు సీజ్​! - ఎందుకో తెలుసా?

ఎమ్మెల్సీ ఎన్నికలతో 7 ఉమ్మడి జిల్లాల్లో అమలులో ఉన్న ఎలక్షన్​ కోడ్​ - పెద్దగా హడావుడి లేకపోవడంతో తెలుసుకోలేకపోతున్న ప్రజలు - పక్కా ఆధారాలు చూపకుంటే నగదు సీజ్​ అవుతుందని అధికారుల వెల్లడి

MLC ELECTIONS CODE

MLC election Code in Telangana : ఉమ్మడి కరీంనగర్-మెదక్​-ఆదిలాబాద్​-నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎలక్షన్​ కోడ్‌ అమలులో ఉంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజలు నగదుతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సరైన పత్రాలు వెంట తీసుకువెళ్లకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో పెద్దగా హడావుడి లేక కోడ్‌ అమలులో ఉన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. సాధారణ పరిస్థితుల మాదిరిగా నగదుతో ప్రయాణం చేస్తే అధికారులు పట్టుకుని సీజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. పక్కా ఆధారాలతోనే నగదును తీసుకువెళ్లాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల కోడ్​ అమలులో పలు జాగ్రత్తలు

ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల్లో ఎవరూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా అధికారులు పకట్బందీగా నిఘాను ఏర్పాటు చేశారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దులలో, చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు మొదలయ్యాయి.

నగదుతో ప్రయాణం చేయాల్సి వస్తే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. రూ.50 వేలకు మించితే అందుకు సంబంధించిన పక్కా ఆధారాలతోనే ప్రయాణించాలి. లేదంటే ఆ నగదును సీజ్‌ చేసే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. నగదు మాత్రమే కాదు వెండి, బంగారం లాంటి ఆభరణాలు కొనుగోలు చేసినా, ఇతర వస్తువులు కొనుగోలు చేసి పట్టణాల నుంచి గ్రామాలకు తీసుకువస్తున్నా సంబంధిత రసీదులు ఉండాలి.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్​ కాబట్టి ఎక్కువగా వివాహ సామగ్రి, చీరలు, బంగారం, వెండి లాంటివి కొనేందుకు పెద్ద మొత్తంలో నగదును వెంట తీసుకుని నగరాలకు వెళ్తుంటారు. అలాంటి వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్దగా నిఘా లేదు కదా అనుకుని ఏమరపాటుగా ఉంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలకు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు జంట నగరాల నుంచి నిత్యం పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతుంటాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు బస్సులు, ద్విచక్రవాహనాలు, కార్లు లాంటి వాహనాల్లో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వీటిలో ప్రయాణించేవారు నగదు తీసుకెళ్లే సమయంలో జాగ్రత్త వహించకుంటే ఆ నగదు అవసరాలకు ఉపయోగపడకుండా సీజ్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఏ వస్తువైనా సరైన ఆధారాలతో తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.