HOW TO GET CERTIFICATES
కాలేజీ మూసేసినా సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు ఎలా తీసుకోవాలంటే?
సర్టిఫికెట్లు తీసుకోవడం ఆలస్యమైందా - ఎత్తివేసిన కాలేజీ నుంచి ధ్రువపత్రాలు ఎలా పొందాలి.
How to Get Certificates From Closed College? : చాలా మంది డిగ్రీ మధ్యలో ఆపేస్తుంటారు. కారణం ఏదైనా తర్వాత మళ్లీ కంటిన్యూ చేయాలి అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ కాలేజీ ఎత్తివేసే సందర్భాలు ఉంటాయి. చదివిన సర్టిఫికెట్లు తీసుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు బుర్రను పాడు చేస్తుంటాయి. అలాంటి సమస్య ఒకరికి వచ్చింది. 2012-2015లో బీఎస్సీ చదివారు. ఫస్ట్ అండ్ సెకెండ్ ఇయర్‌లో కొన్ని సబ్జెక్టులు మిగిలాయి. అయితే సర్టిఫికెట్లు తీసుకోవడం ఆలస్యమైంది. ఈలోగా కాలేజీని ఎత్తివేశారు. యూనివర్సిటీకి వెళ్లి పరీక్ష ఫీజు కట్టబోతే పాత మార్కుల లిస్టులు అడిగారు. ఇప్పుటు ఓపెన్ వర్సిటీ ద్వారా మిగిలిన సబ్జెక్టులు రాసుకునే వీలుందా అని అడగ్గా కెరియర్ కౌన్సలర్ ఏం చెప్తున్నారో చూద్దాం.
డిగ్రీలో ఎన్ని బ్యాక్‌లాగ్స్ ఉన్నాయో చెప్పలేదు. డిగ్రీ కళాశాల మూసివేసినప్పటికీ విద్యార్థుల అడ్మిషన్, స్కాలర్‌షిప్ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ పుస్తకాలు ఎక్కడైనా జాగ్రత్తగా భద్రపరచి ఉంటారు. ఆ బాధ్యత కళాశాల నిర్వాహకులపై ఉంటుంది. మీరు మరొక్కసారి వారిని కలిసి మీ సమస్యను తెలపండి. ఒకవేళ వారి దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చెబితే, అదే విషయాన్ని మీ దరఖాస్తుపై రాతపూర్వకంగా తెలపమని అడగండి. ఆ తరువాత మీ కళాశాల అనుబంధ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని సంప్రదించండి.
మీ మార్కుల మెమోల కాపీలు యూనివర్సిటీలో కచ్చితంగా ఉంటాయి. అవి పొందడానికి ప్రతి యూనివర్సిటీకీ కొన్ని నిబంధనలుంటాయి. వాటి ప్రకారం దరఖాస్తు చేసి, రుసుము చెల్లించి, అవసరమైన పత్రాలు సమర్పించాలి. అలా చేయడం వల్ల మెమోలను కూడా పొందవచ్చు. ఓపెన్ యూనివర్సిటీలో లేటరల్ ప్రవేశం ద్వారా డిగ్రీలో చేరాలన్నా, వారు కూడా మార్కుల మెమోలు అడుగుతారు.
అవి కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు : మార్కుల మెమోలు పొందాక, అవకాశం ఉంటే అదే యూనివర్సిటీ నుంచి డిగ్రీని పూర్తి చేయండి. కుదరని పక్షంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారుల్ని సంప్రదించి, డిగ్రీలో అడ్మిషన్ పొంది, మిగిలిన సబ్జెక్టులు రాసే వీలుంటుందేమో కనుక్కోండి. సాధారణంగా డిగ్రీ మధ్యలో ఒక విద్యార్థి ఒక విద్యాసంస్థ నుంచి మరో విద్యా సంస్థకు మారినప్పుడు రెండు యూనివర్సిటీల సిలబస్‌లూ, కోర్సు నిర్మాణం, క్రెడిట్ల సంఖ్య లాంటివి పరిగణనలోకి తీసుకుంటారు.
అలా కుదరకపోతే మొదటి నుంచి చదవాల్సిందే : యూజీసీ నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాల వ్యవధి గల డిగ్రీని గరిష్ఠంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలి. కానీ మీరు డిగ్రీలో చేరి ఇప్పటికి దాదాపు 13 ఏళ్లు అయింది. కొన్ని యూనివర్సిటీలు మానవతా దృక్పథంతో అప్పుడప్పుడూ పూర్వ విద్యార్థులకు డిగ్రీ పూర్తి చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇస్తూ ఉంటాయి. మీరు డిగ్రీ పరీక్షలు రాసిన యూనివర్సిటీ ఆ ఒక్క అవకాశం ఎప్పుడు ఇస్తుందో కనుక్కొని, డిగ్రీ పూర్తి చేయండి. పాత డిగ్రీని పూర్తి చేయడానికి ఏ ప్రయత్నమూ సఫలం కాకపోతే, మళ్లీ డిగ్రీ మొదటి నుంచి చేయండి. మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేయండి.