STIPEND FOR BIOTECHNOLOGY STUDENTS
నెలకు రూ.12 వేల స్టైఫండ్‌తో బయోటెక్నాలజీ కోర్సు - ఇలా అప్లై చేసుకోండి.
దేశంలోని ప్రముఖ సంస్థలో బయోటెక్నాలజీ కోర్సులు చేయాలనుకునేవారికి సువర్ణావకాశం - గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ట్ ద్వారా ప్రవేశాలు - వివిధ సంస్థల్లోని 79 కోర్సుల్లో ప్రవేశానికి గాట్-బీ స్కోరు తప్పనిసరి.
Biotechnology Course in National University : విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే సైన్స్ కోర్సుల్లో బయోటెక్నాలజీ ముఖ్యమైంది. దీని ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) ఎంపిక చేసిన సంస్థల్లో పీజీలో చేరే విద్యార్థుల కోసం ప్రభుత్వం స్టైపెండ్ అందిస్తోంది. దేశంలోని మేటి సంస్థల్లో బయోటెక్నాలజీ కోర్సులు చదవాలనుకునేవారూ, ఈ విభాగంలో మంచి భవిష్యత్తును ఆశిస్తున్నవారూ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ట్- బయోటెక్నాలజీ (గాట్-బీ) రాయొచ్చు. ఎన్‌టీఏ నిర్వహించే ఈ పరీక్ష నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది.
ప్రముఖ యూనివర్సిటీలలో ఛాన్స్ : బయోటెక్నాలజీలో సేవలందించాలనుకునేవారు, రిసెర్చ్ దిశగా అడుగులేయాలనుకున్నవారు ఈ సంస్థల్లోని చదువులకు ప్రాధాన్యమివ్వొచ్చు. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లోని 79 కోర్సుల్లో ప్రవేశానికి గాట్-బీ స్కోరు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో మొత్తం 1331 సీట్లు ఉన్నాయి. ప్రవేశాలు కల్పించే సంస్థల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూదిల్లీ, ఐఐటీ ఇందౌర్, దిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి లాంటి ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
ఈ సంస్థల్లోని బయోటెక్నాలజీ విభాగాలన్నీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉండటం వల్ల బోధన, ల్యాబ్, లైబ్రరీ, ఇతర సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉంటాయి. వీటిలో చదివినవారు భవిష్యత్తులో మంచి అవకాశాలూ సొంతం చేసుకోగలరు. ఫార్మా సంస్థల్లో వీరికి అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. బోధన, పరిశోధన, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లోనూ రాణించడానికి అవకాశాలు ఎక్కువ. కొన్ని చోట్ల క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ జరుగుతున్నాయి.
స్టైపెండ్ : ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, అనుబంధ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు రూ.5000, ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీకి రూ.7500, ఎంటెక్/ఎంవీఎస్సీ కోర్సులకు రూ.12,000 ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు. కోర్సు వ్యవధి కాలం మొత్తం స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి ఏడాది మెరిట్ చూపితేనే తర్వాతి సంవత్సరం కూడా ప్రోత్సాహం కొనసాగుతుంది.
ఏయే కోర్సులు?
ఎమ్మెస్సీ : బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, కంప్యుటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్సెస్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ.
అర్హత: సంస్థ ప్రకారం అర్హతలు మారుతాయి. ఎక్కువ సంస్థలు బీఎస్సీ సైన్స్ కోర్సులు చదివినవారికే అవకాశాలను ఇస్తున్నాయి. బీఫార్మసీ, ఎంబీబీఎస్, వెటర్నరీ సైన్స్ ఇలా భిన్న విద్యార్హతలతోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలకు మాత్రం బీఎస్సీలో బయోటెక్నాలజీ లేదా అనుబంధ కోర్సులు చదివి ఉండాలని పేర్కొంటున్నాయి.
ఎమ్మెస్సీ (అగ్రి): మాలిక్యులర్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ.
అర్హత: బీఎస్సీ- అగ్రికల్చర్/ ఫారెస్ట్రీ/హార్టికల్చర్/సెరి కల్చర్/అగ్రి బయోటెక్నాలజీ లేదా బీటెక్ బయోటెక్నాలజీ.
ఎంటెక్: మెరైన్ బయోటెక్నాలజీ, బయో ప్రాసెస్ టెక్నాలజీ, కంప్యుటేషనల్ బయాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ.
అర్హత: బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్/ఎమ్మెస్సీ. సంస్థ, కోర్సు ప్రకారం మార్పులు ఉంటాయి.
ఎంవీఎస్సీ: వెటర్నరీ బయోటెక్నాలజీ.
అర్హత: బీవీఎస్సీ
పరీక్ష ఎలా ఉంటుంది?
ప్రశ్నలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. రెండు సెక్షన్లలో ప్రశ్నలు ఉంటాయి.
సెక్షన్-ఏలో 60 మల్టిపుల్ ఛాయిస్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి అర మార్కు(1/2) తగ్గిస్తారు. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్ 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టుల నుంచే వస్తాయి.
సెక్షన్-బీలో వంద మార్కుల ప్రశ్నాపత్రం ఉంటుంది. వీటిలో 60 ప్రశ్నలకు సమాధానాలను గుర్తిస్తే సరిపోతుంది. ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు.
ప్రశ్నలు గ్రాడ్యుయేషన్((డిగ్రీ) స్థాయిలో ఉంటాయి. ఆలోచన, విశ్లేషణ మొదలైన వాటితో సమాధానాలను గుర్తించేలా ప్రశ్నలు అడుగుతారు. బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సిలబస్ వివరాలు వెబ్‌సైట్‌లో వివరంగా పొందుపరిచారు.
ముఖ్య వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తులు : మార్చి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
రిజిస్ట్రేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650. మిగిలిన అందరికీ రూ.1300.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 20వ తేదీ
పరీక్ష కేంద్రాలు : ఏపీలో- గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం.
తెలంగాణలో- హైదరాబాద్/ సికింద్రాబాద్.
వెబ్‌సైట్ కోసం లింక్ : https://exams.nta.ac.in/DBT/
సన్నద్ధత
ముందుగా ఇంటర్మీడియట్ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలను బాగా చదవాలి. ఆ తర్వాత డిగ్రీలోని బయోటెక్నాలజీ పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి.
గత గాట్-బీ ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రశ్నలు అడిగే తీరు, వాటి స్థాయి తెలుసుకుని అందుకు సరిపోయేలా ఎలా సన్నద్ధం కావాలో అర్థమవుతుంది.
సీయూఈటీ (పీజీ) బయోటెక్నాలజీ ప్రశ్నపత్రాలు ప్రిపరేషన్‌లో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఐఐటీ జామ్ క్వశ్చన్ పేపర్లతో ప్రయోజనం ఉంటుంది.
సన్నద్ధత పూర్తయిన తర్వాత చాప్టర్ల వారీ వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టిస్ చేయాలి.
కనీసం 10 మాక్ టెస్టులు రాసి, పరీక్షల వారీగా రిజల్ట్‌ను సమీక్షించుకుని, మరింత మెరుగుపడాలి.
నెగెటివ్ మార్కులు ఉన్నందున తెలియనివి వీలైనంత వరకు వదిలేస్తేనే మేలు.