Ambedkar Overseas Vidya Nidhi Scholarship 2024
Govt Schemes: విద్యార్థుల చదువుకు రూ.20 లక్షల సాయం.. వెంటనే అప్లయ్ చేసుకోండి! ఈనెల 31 ఆఖరు తేది.
Ambedkar Overseas Vidya Nidhi Scholarship 2024 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం (Ambedkar Overseas Vidya Nidhi) ద్వారా విదేశాల్లో చదువుకునేందుకు ఎస్సీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది. మన రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో సీట్ వస్తే చాలు ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది.
దీంతో విద్యానిధి పథకానికి జిల్లా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో రూ.10లక్షలు.. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ విద్యార్థి విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చదివేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకం కింద మొదట్లో రూ.10లక్షల ఆర్థికసాయం అందించింది. అయితే రూ.10లక్షలు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి రావడంతో పెద్దగా విదేశాల్లో చదివేందుకు ఎస్సీ విద్యార్థులు పెద్దగా ముందుకు రాలేదు. అయితే ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మళ్లీ పథకం నిబంధనలు సడలించింది. కుటుంబ ఆదాయం రూ.5 లక్షలకు పెంచడంతోపాటు విదేశీ విద్యకు అందించే ఆర్థికసాయాన్ని రూ.20 లక్షలు చేసింది. దీంతో రాష్ట్రానికి చెందిన ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్యకోసం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నిరుపేద ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అభ్యర్థులు టోఫెల్, జీఆర్ఈ, జీమ్యాట్,పీటీఈ, ఐఈఎల్‌టీఎస్ ఏదైనా ఒక పరీక్షను రాసి విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారు మాత్రమే అర్హులని వెల్లడించారు. విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు