Election schedule 2024
Lok Sabha Election schedule: లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం షెడ్యూల్ విడుదల అయింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది.
7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు
17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2024తో ముగియనుంది. అంతకు ముందు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ లేదా కూటమికి మెజారిటీ 272 సీట్లు అవసరం.
పోలింగ్ తేదీలుః
మొదటి దశ – ఏప్రిల్ 19 – మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు
రెండవ దశ – 26 ఏప్రిల్ – మొత్తం స్థానాలు – 89
మూడవ దశ – 7 మే – మొత్తం స్థానాలు – 94
నాల్గవ దశ – 13 మే – మొత్తం స్థానాలు – 96
5వ దశ – 20 మే – మొత్తం స్థానాలు – 49
ఆరవ దశ- 25 మే – మొత్తం స్థానాలు – 57
7వ దశ – 1 జూన్ – మొత్తం స్థానాలు – 57
ఓట్ల లెక్కింపు – జూన్ 4.
2024 ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల సంవత్సరం అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామిక భారత దేశంలో ఎన్నికలకు తమ బృందం పూర్తిగా సిద్ధమైందన్నారు. పూర్తి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్ 16, 2024తో ముగుస్తుందని తెలిపారు. 2024 ఎన్నికలకు దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్ల సంఖ్య 49.7 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లకు పైగా ఉంది. ఇందు కోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రెండేళ్లుగా ఎన్నికలకు సిద్ధమయ్యామన్నారు.
ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం మనకు నాలుగు రెట్లు కష్టమని, ఇందుకోసం 4Mగా నిర్ణయించామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కండబలం, డబ్బు, తప్పుడు సమాచారం, MCC ఉల్లంఘనలను అరికట్టడానికి ఎన్నికల సంఘం కట్టుబడి ఉందన్నారు. ఈ అంతరాయం కలిగించే సవాళ్లను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంంటామని హెచ్చరించారు.
ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులు విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల తేదీలను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుత లోక్‌సభ పదవీ కాలం జూన్ 16వ తేదీతో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో ముగియనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో ముగియనుంది.