Love for father.. Rs. Donation of land worth 3 crores
తండ్రిపై ప్రేమ.. రూ. 3 కోట్ల విలువైన భూమి విరాళం.
తండ్రిపై ఉన్న ప్రేమతో ఓ వ్యక్తి భారీ విరాళం అందించాడు. ఇస్కాన్ సంస్థకు సుమారు రూ.3 కోట్ల విలువగల తొమ్మిదిన్నర ఎకరాల భూమిని విరాళంగా అందించి తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హన్మాన్‌ఫారం గ్రామానికి చెందిన కొండపావులూరి శ్రీనివాస్ రావు హైదరాబాద్‌లోనే ఉంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. మండలంలోని శాఖాపూర్ శివారులో వీరికి తొమ్మిదిన్నర ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమిని తన తండ్రి వెంకటేశ్వరావు జ్ఞాపకార్థం ఇస్కాన్ సంస్థకు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఆదివారం (మార్చి 3) ఆ భూమిలో శ్రీనివాస్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణ మందిరం, వృద్ధాశ్రమం, గోశాలతో పాటు ఇతర భవనాల నిర్మాణం కోసం స్థలాన్ని ఇస్కాన్ సంస్థకు అందించామని శ్రీనివాస్ రావు తెలిపారు. అనంతరం సొంత నిధులు రూ.లక్షతో స్వగ్రామంలో ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.