Heart Stroke In Summer
ఎండాకాలంలో స్ట్రోక్ ప్రమాదం! ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Heart Stroke In Summer : హై బీపీ, హై కొలెస్ట్రాల్, అధిక బరువు వంటి వివిధ కారణాల వల్ల గుండె జబ్బులు వస్తాయి. అయితే, ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం.. ఎండ వేడి కారణంగా కూడా స్ట్రోక్ వస్తుందని నిపుణులంటున్నారు. అసలు, గుండెపోటు రావడానికి ఎండ వేడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం
Heart Stroke In Summer : రోజురోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనాలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చే వారు ఎండ వేడి, వడగాలుల నుంచి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గుండె జబ్బులతో బాధపడేవారు సమ్మర్‌లో ఇంకా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. లేకపోతే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎండాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు : చాలా మంది సమ్మర్‌లో వడగాల్పులు, వేడి కారణంగా నీరసంగా ఉంటారు. అలాగే, కొంత మందిలో పిక్కలు పట్టేస్తుంటాయి. ఇంకా.. తలనొప్పి, చర్మం కమలటం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. వడదెబ్బ బారిన పడుతుంటారు.
వేడికి, స్ట్రోక్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
ఎండ ప్రభావానికి ఎక్కువగా గురైన వారి రక్తంలో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లతో పోరాడే కణాల సంఖ్య తగ్గుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఎండ వేడి కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. దాంతో మెదడులో రక్తప్రవాహం పెరిగి బ్రెయిన్ ఒత్తిడికి గురవడం వల్ల స్ట్రోక్ వస్తుందని నిపుణులంటున్నారు.
పరిశోధన వివరాలు : 2019లో "ది లాన్సెట్" జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎండ వేడి స్ట్రోక్ ప్రమాదాన్ని 35 శాతం పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో పర్యావరణ ఆరోగ్య శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పని చేసే "డాక్టర్ ఆంటోనియో గాస్పర్" పాల్గొన్నారు. ఎండ వేడిమి వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి :
- ఎండాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు అన్ని వయసుల వారు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
- గుండె జబ్బులు ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లడం మంచిది కాదు. వీరు చల్లని ప్రదేశంలో ఉండటం మంచిది.
- బాడీని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎక్కువగా నీళ్లను తాగండి.
- అలాగే.. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోండి.
- ఉదయాన్నే వ్యాయామం చేయండి.
- ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.