Public USB Phone Charging Problems
పబ్లిక్ కేబుళ్లతో ఫోన్ ఛార్జింగ్ యమా డేంజర్- ఈ టిప్స్ పాటించకపోతే మీ డేటా అంతా చోరీ!
Public USB Phone Charging problems : సాధారణంగా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు పబ్లిక్ ఛార్జింగ్ యూఎస్బీ కనెక్టర్లతో ఛార్జింగ్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తోంది భద్రతా సంస్థ. దేశంలో ఇప్పుడు యూఎస్బీ ఛార్జింగ్ స్కామ్ ఆందోళన కలిగిస్తోందని, ఇలాంటి కేసులు ఎక్కువ పెరిగిపోతున్నాయని ఇటీవల ప్రజలను హెచ్చరించింది.
ముఖ్యంగా ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, కేఫ్‌లలో మొబైల్ ఛార్జింగ్ ఉపయోగించకూడదని చెబుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ వ్యవస్థ మనకు సహాయం చేస్తుంది. కానీ ఇది వినియోగదారులకు హాని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది భారత ప్రభుత్వం. భారతీయ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లేదా CERT-in ఈ ఏడాది మార్చిలో ఈ భద్రతా హెచ్చరికను జారీ చేసింది. యూఎస్బీ ఛార్జర్ స్కామ్‌ల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరింది. అయితే అసలేం జరుగుతోంది?
జ్యూస్ జాకింగ్ అంటే ఏమిటి?
పబ్లిక్ ఛార్జర్‌లు హ్యాకర్‌ల స్వర్గధామంగా మారాయని, ఇవి మాల్వేర్‌తో పరికరాలను ప్లగ్ చేస్తాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. స్మార్ట్ ఫోన్లలో ఉండే డేటాతోపాటు నగదు, ఇతర ముఖ్యమైన వివరాలను సైబర్ నేరగాళ్లు దొంగలించే ప్రమాదం కూడా ఉంది. ఈ దాడికి జ్యూస్ జాకింగ్ అనే పదం కూడా ఉంది. ఈ జ్యూస్ జాకింగ్ తో హ్యాకర్లు మాల్వేర్ తో ఛార్జింగ్ చేసే డివైసులను ఇన్ఫెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తారు. జ్యూస్ జాకింగ్ అనేది వినియోగదారులపై దాడి చేయడానికి సులభమైన మార్గంగా మారింది. ఇలా పబ్లిక్ ప్రాంతాల్లో ఛార్జింగ్ చేసే స్మార్ట్ ఫోన్లపై సైబర్ నేరగాళ్లు యూఎస్బీ ఛార్జింగ్ పోర్టులను ఉపయోగస్తున్నారు. యూఎస్బీ ఛార్జింగ్ స్టేషన్లో స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టడం వల్ల వినియోగదారులు జ్యూస్ జాకింగ్‌కు గురవుతున్నారని CERT-IN హెచ్చరించింది.హ్యాకర్లు పరికరానికి యాక్సెస్‌ను పొందినట్లయితే, వారు డేటాను దొంగిలించడానికి హానికరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే అవకాశం కూడా ఉంటుందని భద్రతా సంస్థ హెచ్చరించింది. గత ఏడాది ఇదే విధమైన భద్రతా హెచ్చరికను ఎఫ్‌బీఐ జారీ చేసింది. ఈసారి భారత ప్రభుత్వం తమ పౌరులకు ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి స్కామ్‌ల నుంచి మీ డివైజులను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇఫ్పుడు తెలుసుకుందాం.
CERT-In ఇస్తున్న సలహా ఇదే:
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు లేదా ఛార్జర్లను ఉపయోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
- మొబైల్ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఎలక్ట్రానిక్ వాల్ అవుట్‌లెట్‌లను ఉపయోగించాలి.
- ఎల్లప్పుడూ మీ సొంత పవర్ బ్యాంక్‌ను మీ దగ్గర ఉంచుకోవడం ఉత్తమం.
- మీరు ఛార్జింగ్ చేసినప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ కానీ, లాక్ కానీ తప్పనిసరి పెట్టాలి.
- ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ చేయాలి
ప్రస్తుతం ప్రతీదీ ఫోన్ ద్వారా చేస్తున్నాం. ఆర్థిక లావాదేవీల నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయడం వరకు అన్నింటికీ మొబైల్ ద్వారా నగదు చెల్లిస్తున్నాం. ఇలాంటి ముఖ్య సమాచారం అంతా కూడా మొబైల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ డేటా మొత్తం కూడా హ్యాకర్ చేతిలోకి వెళ్తే మీ డబ్బుతోపాటు ముఖ్య సమాచారం అంతా కోల్పోవలసి ఉంటుంది.