The queue of these countries to buy cow dung.. What is the price?
Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?
Cow Dung : ‘‘అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల.. కాదేదీ బిజినెస్‌కు అనర్హం’’ అన్నారు పెద్దలు. చివరకు ఆవుపేడ కూడా బిజినెస్‌కు అనర్హం కాదని నిరూపితం అయిపోయింది. ఎందుకంటే ఆవుపేడ కోసం మనదేశానికి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఆవుపేడ కోసం భారత్‌కు భారీగా ఆర్డర్లు ఇస్తున్న దేశం ఏదో తెలుసా ? కువైట్. ఇటీవలే దాదాపు 200 మెట్రిక్ టన్నుల ఆవు పేడ కోసం భారత్‌కు కువైట్ ఆర్డర్లు ఇచ్చింది. ఆవుపేడను వినియోగించడం వల్ల అరబ్ దేశాల్లో ఖర్జూరా రైతులకు మంచి దిగుబడులు వస్తున్నాయి. ఆవుపేడను వినియోగించే ఖర్జూరా తోటల్లో.. ఖర్జూరాల సైజు సాధారణం కంటే పెరుగుతోందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే ఇంత భారీ ఆర్డర్లు ఇచ్చి మరీ భారత్ నుంచి ఆవు పేడను కొనుగోలు చేస్తున్నారు.
ఆవుపేడను కొంటున్న దేశాలివీ..
మాల్దీవులలో సేంద్రీయ వ్యవసాయం పెద్దఎత్తున జరుగుతోంది. అందుకే ఆ దేశం మన భారత్ నుంచి ఆవు పేడను కొంటోంది.
సింగపూర్, నేపాల్, బ్రెజిల్ దేశాలలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆయా దేశాలు వ్యవసాయ అవసరాల కోసం ఆవు పేడను భారత్ నుంచి కొంటున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి ఎడారి ప్రాంతాల్లో వ్యవసాయానికి సహాయపడే సహజ ఎరువుగా ఆవుపేడను వాడుతున్నారు. ఆ దేశం నుంచి బాగానే ఆర్డర్లు వస్తున్నాయి.
కొన్ని అరబ్ దేశాలు ఆవుపేడను బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కూడా వాడుతున్నాయి.
ఇంకొన్ని దేశాలు ఆవుపేడను నిర్మాణ రంగంలో వినియోగిస్తున్నాయి.
ఆవుపేడ ధర ఎంత ?
విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నందున ఆవుపేడ(Cow Dung) మంచి ధరే పలుకుతోంది. సాధారణ తరహా ఆవుపేడ ధర కిలోకు రూ.30 ఉంది. మంచి క్వాలిటీ ఉన్న ఆవు పేడకు కిలోకు రూ.50 దాకా రేటును చెల్లిస్తున్నారు. డిమాండ్ పెరిగే కొద్దీ ఆవుపేడ ధర మరింత పెరుగుతుందని అంచనావేస్తున్నారు.