TG Law CET 2025 Notification
తెలంగాణ లాసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడేండ్లు, ఐదేండ్ల లాతోపాటు ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్- 2025), పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీజీఎల్‌సెట్-2025) నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 1 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అభ్యర్థులకు జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
మూడు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ లాసెట్) రాసే విద్యార్ధులు తప్పనిసరిగా ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే తెలంగాణ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీజీఎల్‌సెట్)-2025కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 15, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు, రూ. వెయ్యి ఆలస్య రుసుముతో మే 5 వరకూ, రూ. 2 వేల ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ. 4 వేల ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద లాసెట్‌కు రూ.900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600 చెల్లించాలి. అలాగే పీజీఎల్‌సెట్‌కు రూ.1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.900 చొప్పున చెల్లించాలి. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మే 20 నుంచి 25 వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. మే 30న హాల్‌టికెట్లు విడుదల చేస్తారు. ఇక టీజీ లాసెట్- 2025, టీజీ పీజీఎల్‌సెట్-2025 ప్రవేశ పరీక్షలు జూన్ 6న నిర్వహిస్తారు. జూన్ 25న ఫలితాలు విడుదలవుతాయి. లాసెట్ రాత పరీక్ష ఇంగ్లిష్/ తెలుగు, ఉర్దూ మీడియంలలో.. పీజీఎల్‌సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో జరుగుతాయి.