Free Services at Petrol Stations
పెట్రోల్ బంకుల్లో ఈ ఉచిత సేవలు మీకు తెలుసా? - అయితే తెలుసుకోండి.
చాలామందికి బంకుల్లో లభించే మౌలిక సదుపాయాల గురించి అవగాహన అవసరం - సౌకర్యాలు కల్పించకపోతే ఫిర్యాదు చేసే అవకాశం
Free Services at Petrol Stations : బంకులో ఓ వ్యక్తి పెట్రోల్ పోయించి కొద్ది దూరం వెళ్లగానే బైక్ మొరాయించింది. పెట్రోల్ నాణ్యత లేదని గుర్తించి వెంటనే బంకుకు వచ్చి యజమానిని నిలదీశాడు. ఆ యజమాని నుంచి నిర్లక్ష్య సమాధానం రావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియలేదు. ఇప్పటికీ చాలా మందికి బంకుల్లో లభించే మౌలిక సదుపాయాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆయా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించినా, లేకపోయినా ఈ సౌకర్యాలను ఉచితంగా పొందవచ్చు. బంకుల్లో ఈ సౌకర్యాలు లేకుంటే పెట్రోలియం సంస్థలకు వెంటనే ఫిర్యాదు చేయొచ్చు.
ప్రథమ చికిత్స కిట్ : పెట్రోల్ బంకులో ప్రధానమైన సదుపాయం ప్రథమ చికిత్స కిట్. కిట్‌లోని వైద్య పరికరాలను, ఔషధాలను ఎప్పటికప్పుడు మార్చడం తప్పనిసరి.
స్వచ్ఛమైన తాగునీరు: దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా ప్రాంతాల్లో నీటి సౌకర్యం లభించదు. ఇక వేసవి కాలంలో అయితే చెప్పనవసరం లేదు. తాగు నీటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలి. అందుకు బంకు యజమాని క్వాలిటీ కలిగిన ఆర్వో యంత్రం, నీటి సదుపాయం ఏర్పాటు చేస్తారు.
మరుగుదొడ్లు : బయట శౌచాలయాలు లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా అన్ని బంకుల్లో శుభ్రతమైన వాష్‌రూమ్స్ ఉండాలి.
ఫోన్ సౌకర్యం: అత్యవసర సమయాల్లో ఫోన్ చేసుకునేందుకు పెట్రోల్ బంకుల్లో సదుపాయం ఉంటుంది.
వాహనాలకు ఉచిత గాలి : వినియోగదారుల వాహనాల టైర్లలో గాలి నింపడానికి, తనిఖీ చేసుకోవడానికి తప్పనిసరిగా సంబంధిత మిషన్ ఉండాలి. ఓ వ్యక్తి కూడా అక్కడ అందుబాటులో ఉండాలి. ఇది పూర్తిగా ఉచితం. సర్వీస్ నచ్చితే టిప్ కూడా ఇవ్వొచ్చు. అది కస్టమర్ ఇష్టం.
ఫిర్యాదుల పెట్టె : పెట్రోల్ బంకుకు సంబంధించి ఏమైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. అందుకోసం ఫిర్యాదు పెట్టె అందుబాటులో ఉంచాలి. వినియోగదారులు ఫిర్యాదు, సలహాలు, సూచనలు రాసి ఆ పెట్టెలో వేయొచ్చు.
నాణ్యత ప్రమాణాల తనిఖీ : పెట్రోల్, డీజిల్ నాణ్యతపై అనుమానం కలిగితే అక్కడే చెక్ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పరికరాలు, ఫిల్టర్ కాగితాలు కూడా బంకు సిబ్బందే ఇవ్వాలి. దీనితో పాటు పెట్రోల్, డీజిల్ తక్కువ పరిమాణంలో వస్తుందనిపించినా పరీక్షించుకోవచ్చు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
బంకుల్లో నిబంధనల ప్రకారం ఈ సదుపాయాల్లో ఏ ఒక్కటి లేకపోయినా, బంకు సిబ్బంది వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించినా కింది నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. చిరునామా, ఇతర సమాచారం ఇస్తే సంబంధిత చమురు సంస్థ వారిపై వెంటనే చర్యలు తీసుకుంటుంది.
ప్రముఖ చమురు సంస్థల ఫోన్ నెంబర్లు
భారత్ పెట్రోలియం: 1800224344
ఇండియన్ ఆయిల్: 1800233355
హెచ్‌పీసీఎల్: 18002333555
రిలయన్స్: 18008919023