LONG HAIR VILLAGE
జుట్టు రాలుతున్న అమ్మలారా, అక్కలారా - వీళ్ల జడలు చూడండి మర్రి ఊడలే! - ఆ సీక్రెట్ ఇదే! -
- ఆ ఊళ్లో మహిళల జుట్టు పొడవు 4 అడుగులు - గిన్నీస్ రికార్డు కొట్టారు! - వాళ్ల టిప్స్‌ను మీరు కూడా ఫాలో అయిపోండి!
Long Hair Village in Telugu: జుట్టు అంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టమో! ఎంత పొడవుగా ఉంటే అంత, ఎంత ఒత్తుగా ఉంటే అంతగా మురిసిపోతారు. పొడుగు జుట్టు అమ్మాయిలకు అదనపు అందాన్ని కూడా తీసుకొస్తుంది. కానీ, తమ జుట్టు చూసుకొని సంతోషించేవాళ్లు చాలా తక్కువ మంది. రకరకాల కారణాలతో జుట్టు ఊడిపోతోందని బాధపడేవాళ్లే ఎక్కువ.
కానీ ఆ గ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అమ్మాయిల దగ్గర్నుంచి అమ్మమ్మల దాకా ప్రతి ఒక్కరి జుట్టూ మోకాళ్ల కింది వరకు ఉంటుంది. ఇక కొంతమంది జుట్టైతే వాళ్ల ఎత్తునే మించిపోతుంది. మరి, ఇంతకీ ఎవరా మహిళలు? ఎక్కడుందా గ్రామం? వారి పొడవాటి జుట్టు వెనకున్న రహస్యాలేంటి? అని తదితర వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
నాలుగడుగలకు పైనే:
పొడవాటి జుట్టు అంటే ఏదో నడుము వరకు ఉండే వాలుజడ అనుకుంటున్నారేమో! కానే కాదు. ఈ మహిళల జుట్టు పొడవు కనీసం నాలుగు అడుగులు ఉంటుంది. ఇక కొంతమందికి అయితే ఐదు అడుగులు, మరికొందరికి తమ ఎత్తునే మించిపోయేంత పొడవుగా కేశాలు ఉంటాయి!
ఆ ఒక్కసారే జుట్టు కటింగ్:
ఇక్కడి మహిళలు తమ జీవితంలో ఒకే ఒక్కసారి జుట్టు కత్తిరించుకుంటారు. అది కూడా 18 సంవత్సరాల వయసులో "కేశ ఖండన" పేరుతో నిర్వహించే వేడుకలో ఇలా చేస్తారు. తమ తెగకు చెందిన మహిళలు పూర్వకాలం నుంచి ఇలా జుట్టును పెంచుకుంటున్నట్లు, ఈ పురాతన సంప్రదాయాన్ని తామూ కొనసాగిస్తున్నామని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ పూర్వీకులు ఎప్పుడూ తమతోనే ఉన్నట్లుగా అనిపిస్తుందట.
పొడవు జుట్టు వెనుక సీక్రెట్ అదేనా?:
జుట్టును పొడవుగా పెంచుకోవడమే కాదు దాన్ని అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు ఇక్కడి మహిళలు. ఈ క్రమంలో పెళ్లి కాని అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకు హంగులద్దితే, పెళ్లైన స్త్రీలు తల ముందు భాగంలో పెద్ద బన్ మాదిరిగా హెయిర్‌స్టైల్ వేసుకుంటారు. ఇక ఈ మహిళల జుట్టు ఇంత పొడవుగా, ఒత్తుగా ఉందంటే దానికి సహజ సిద్ధమైన చిట్కాలే కారణమంటున్నారు.
బియ్యం కడిగిన నీళ్లను జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగించడం, తేయాకు-ఇతర మూలికలతో తయారుచేసిన నేచురల్ షాంపూతో జుట్టును క్లీన్ చేసుకోవడం, జుట్టు సంరక్షణకు ఆల్కలైన్ నీళ్లు వాడడం వంటి చిట్కాలు పాటిస్తుంటారట. ఇవే కాకుండా ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్‌నూ తరచూ ఆహారంలో తీసుకోవడం తమకు అలవాటని చెబుతున్నారు. ఇలా పొడవాటి జుట్టుతో ‘చైనీస్ రియల్ లైఫ్ రాపంజెల్స్’గా పేరు తెచ్చుకున్నారీ మహిళలు. అంతేకాదు ఈ ప్రత్యేకతతో ఈ గ్రామానికి "లాంగ్ హెయిర్ విలేజ్"గానూ గుర్తింపు వచ్చింది.
గిన్నిస్‌లోనూ చోటు!:
ఇక్కడి మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాకుండా గిన్నిస్ రికార్డు కూడా సృష్టించారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన "Longji Long Hair Festival"లో భాగంగా గిన్నిస్ రికార్డ్ పోటీల్లో పాల్గొన్నారు ఈ తెగకు చెందిన 256 మంది మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకొని, ఒకరి వెనకాల ఒకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చెయిన్‌గా ఏర్పడ్డారు. దీంతో "లాంగెస్ట్ హెయిర్ కోంబింగ్ చెయిన్"గా ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై.. "లాంగ్ హెయిర్ బల్లాడ్" అంటూ పాటలు పాడుతూ మరీ ఈ వేడుక చేసుకున్నారు.
ఇంతకీ ఆ విలేజ్ ఎక్కడంటే:
ఇదంతా చదివిన తర్వాత ఆ గ్రామం ఏదో తెలుసుకోవాలని ఉందా? ఆ ఊరిపేరు "హుయాంగ్లుయో". దక్షిణ చైనాలోని గుయ్‌లిన్ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.