RATION CARDS IN TELANGANA
రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలనకు యాప్ - అన్నీ చెక్ చేశాకే కొత్త కార్డు
దరఖాస్తుల విచారణ అనంతరం ఆర్‌ఐ నుంచి తహాసీల్దార్‌కు - మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నుంచి మున్సిపల్ కమిషనర్‌కు సంబంధిత వివరాలు - అన్ని సవ్యంగా ఉంటే కార్డులు మంజూరు చేయనున్న పౌరసరఫరాల శాఖ కమిషనర్
New Ration Card Verification in Telangana : మొబైల్ యాప్‌లో దరఖాస్తుల విచారణ అనంతరం ఆర్‌ఐ నుంచి తహసీల్దార్‌కు, అక్కడి నుంచి డీఎస్వో లాగిన్‌కు రేషన్ కార్డు దరఖాస్తుదారుల వివరాలు వెళ్తాయి. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ లాగిన్ నుంచి మున్సిపల్ కమిషనర్‌కు, అక్కడి నుంచి డీఎస్వో లాగిన్‌కు వస్తాయి. వీటన్నింటినీ డీఎస్వో పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్‌కు ఆన్‌లైన్‌లో సమర్పిస్తారు. కార్డుల మంజూరు వివరాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో వెల్లడి కానున్నాయి.
ప్రత్యేక మొబైల్ యాప్ :
రేషన్ కార్డుల కోసం చేసిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను సైతం రూపొందించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో వీలైనంత త్వరగా అప్‌డేట్ చేయనున్నారు.
మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే :
ప్రజా పాలన గ్రామ సభల్లో ఫిబ్రవరి 18 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఈ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆయా దరఖాస్తుల పరిశీలన బాధ్యతను మున్సిపాలిటీల్లో వార్డు అధికారులకు అప్పగించనున్నారు. మండలాల్లో అయితే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐ) చేయనున్నారు. ఎంపిక చేసిన ఆర్‌ఐలు, వార్డు అధికారులు తమ మొబైల్ ఫోన్‌లో ప్రభుత్వం రూపొందించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇళ్లకు వెళ్లి మరీ విచారణ :
వారికి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సంబంధిత అధికారులు కేటాయించనున్నారు. దరఖాస్తులు యాప్‌లో లభ్యమవుతాయి. వాటి ఆధారంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేయనున్నారు. ఇందుకు కచ్చితమైన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఊహించిన దాని కంటే ఎక్కువగానే వచ్చినట్లు అధికారులు చెప్పారు.
తప్పుల సవరణ దరఖాస్తులు పెండింగ్‌లో:
రేషన్ కార్డులో పేరు నమోదు చేయాలని, తప్పులు సవరించాలని కోరుతూ కొన్నేళ్లుగా మీసేవ కేంద్రాల్లో వేలాది మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇలాంటి దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఆర్‌ఐ, తహసీల్దార్, డీఎస్వో లాగిన్‌లో వేర్వేరు దశల్లో ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. ఈ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం సాధ్యమైనంత మేరకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొత్త కార్డులు జారీ చేసిన అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలన అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.