SUMMER SAFETY TIPS FOR OLDER ADULTS
ఎండాకాలంలో పదిలంగా ఉండాలా? వృద్ధులు ఈ జాగ్రత్తలు పాటిస్తే బెటర్!
-ఎండతో వేడి సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం! -వేసవికాలం వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
Summer Safety Tips for Older Adults: ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. వయో వృద్ధుల్లో చెమట అంతగా ఉత్పత్తి కాదని.. శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యమూ తగ్గుతుందని తెలిపారు. ఫలితంగా వేడి సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. అందువల్ల వృద్థులను కాపాడుకోవటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తగినంత నీరు:
వేడి సమస్యల నివారణలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. కాబట్టి వృద్ధులను రోజంతా తగినంత నీరు తాగేలా ప్రోత్సహించాలని.. దాహం వేయకపోయినా తాగేలా చూడాలని చెబుతున్నారు. మొత్తమ్మీద మూత్రం రంగు గాఢంగా మారకుండా చూసుకోవాలని తెలిపారు. మద్యం ఒంట్లో నీటిశాతం తగ్గేలా చేస్తుందని.. కాబట్టి దీని జోలికి వెళ్లనీయొద్దని సలహా ఇస్తున్నారు. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేయాలని అంటున్నారు.
బయటకు తక్కువగా:
ఎండ ఎక్కువగా కాసే సమయంలో ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అంతగా అవసరమైతే ఉదయం గానీ సాయంత్రం గానీ బయటకు వెళ్లేలా జాగ్రత్త పడాలని తెలిపారు. ఒకవేళ పగటి పూట బయటకు వెళ్తే విధిగా గొడుగు, వెడల్పయిన అంచుల టోపీ, చలువ కళ్లద్దాలు ధరించేలా చూడాలని.. చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాయాలని వివరిస్తున్నారు.
ఇంట్లో చల్లదనం:
వేసవిలో వృద్ధుల సంరక్షణకు ఇంట్లో చల్లగా ఉండే వాతావరణం కల్పించాలని సూచిస్తున్నారు. హాలులో, పడకగదిలో ఫ్యాన్లు, కూలర్లు లేదా ఏసీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కిటికీలకు, తలుపులకు వట్టివేళ్ల పరదాలైనా వేలాడదీయొచ్చని.. వీటిని నీటితో తడిపితే ఇల్లు చల్లగా ఉంటుందని అంటున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారం:
ముఖ్యంగా వృద్ధులకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలని సూచిస్తున్నారు. నీటితో కూడిన పుచ్చకాయ, ద్రాక్ష, బత్తాయి, సొరకాయ, బీరకాయ వంటి పండ్లు, కూరగాయలు తినాలి. ఇవి అవసరమైన పోషకాలను అందిస్తూనే ఒంట్లో నీటిశాతం తగ్గకుండా కాపాడి వేసవి నిస్త్రాణను తగ్గిస్తాయని తెలిపారు. ఇంకా వేసవిలో వృద్ధులకు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, వేపుళ్లు ఇవ్వకపోవటమే మంచిదని సలహా ఇస్తున్నారు.
వాతావరణాన్ని తెలుసుకోవాలి:
వాతావరణ సంస్థలు జారీచేసే ఉష్ణోగ్రత వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వడగాలులు వీచే అవకాశముంటే మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇంట్లోకి వేడి గాలి రాకుండా జాగ్రత్త పడాలని.. ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా వేడి గాలి వృద్ధులకు చిక్కులు తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు.
దుస్తుల మీదా శ్రద్ధ:
ఇంకా ముదురు రంగుకు బదులు లేత రంగు దుస్తులు ధరించేలా చూడాలని.. వదులైనవి, నూలు దుస్తులైతే మరీ మంచిదని తెలిపారు. ఇవి శరీరం చుట్టూ గాలి ఆడేలా చేయటం ద్వారా చల్లదనం కల్పిస్తాయని.. వేడి వాతావరణంలోనూ హాయినిస్తాయని వివరిస్తున్నారు.
హెచ్చరిక సంకేతాలు గమనించాలి:
ముఖ్యంగా తికమక పడటం, తూలటం, నీరసం, నిస్త్రాణ వంటివి గమనిస్తే వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.