PAKISTAN PASSENGER TRAIN HIJACKED
పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్- దుండగుల చెరలో 500 మంది ప్రయాణికులు!
Pakistan Passenger Train Hijacked : పాకిస్థాన్‌లో ప్రయాణికుల రైలు హైజాక్- ముష్కరుల చెరలో 500 మంది- దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌పీ) ప్రకటన!
ఆర్మీ రంగంలోకి దిగితే- బందీలను చంపేస్తాం: బీఎల్‌పీ హెచ్చరిక
Pakistan Passenger Train Hijacked : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని ఆరుగురు సాయుధులు బీభత్సం సృష్టించారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై అబ్-ఏ-గమ్ ప్రాంతంలో కాల్పులకు పాల్పడి దానిని హైజాక్ చేశారు. కాల్పుల్లో పలువురు ప్రయాణికులు గాయపడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. దుండగులను గుర్తించడానికి ఇప్పటికే సైనిక దళాలు రంగంలోకి దిగాయని స్థానిక పత్రిక పేర్కొంది. అలాగే ప్రయాణికుల సహాయార్థం అత్యవసర సహాయ రైలును కూడా పంపినట్లు తెలిపాయి. లోకో పైలట్‌కు తీవ్ర గాయలైనట్టు అధికారులు ధ్రువీకరించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కాల్పులు జరిగిన రైలులో 9 బోగీలు ఉన్నాయని, మొత్తం 500 మంది ఉన్నారని తెలుస్తోంది. అబ్-ఏ-గమ్ ప్రాంతంలోని టన్నెల్ నెంబర్ 8 వద్ద సాయుధులు రైలును ఆపి కాల్పులకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
దాడి చేసింది మేమే!
ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌పీ) ప్రకటించింది. రైలు ప్రయాణికుల్లో వంద మందికి పైగా బందీలుగా తీసుకెళ్లామని, ఆరుగురు భద్రతా సిబ్బందిని కాల్చి చంపామని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ ప్రారంభిస్తే బందీలుగా ఉన్న వారందరినీ చంపేస్తామని హెచ్చరించింది. ఈ గ్రూప్‌ను ఇప్పటికే పాకిస్థాన్ సహా యూకే, యూఎస్ కూడా నిషేధించడం గమనార్హం.
ఎందుకు దాడులు చేస్తోంది?
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్- అఫ్గానిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ ప్రావిన్సు పట్ల వివక్ష చూపుతోందని, అంతేకాదు ఖనిజాల దోపిడీకి పాల్పడుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తోంది. పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ తిరుగుబాటు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్ ఆర్మీ దళాలపై, ప్రభుత్వ ప్రాజెక్టులపై బీఎల్‌ఏ దాడులు చేసింది కూడా. గతేడాది క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 26 మంది మృతి చెందారు. 62 మంది గాయపడ్డారు.