Telangana: Farmer who saved four lives by donating his organs
Telangana: తన అవయవాలను దానం చేసి నలుగురి ప్రాణాలు నిలిపిన రైతు.
బతికున్నప్పుడే ఇతరులకు సహాయం చేసిన వాడే మహనీయుడని అన్నారు పెద్దలు. మనం మట్టిలో కలిసిపోకముందే మన అవయవాలను మరికొందరికి దానం చేసి ప్రాణం పోయవచ్చు. అలా అవయవదానం చేస్తే అవయవాలు పని చేయని కొందరికి పునర్జన్మ లభిస్తుంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్ ద్వారా అవయవాలను దానం చేయడంతో మరో నలుగురికి పునర్జన్మ ఇచ్చింది అతని కుటుంబం.
నల్లగొండ మండలం కాకుల కొండారంనకు చెందిన యాస చిత్తరంజన్ రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ చలాకీగా ఉండేవాడు. తలనొప్పిగా ఉందంటూ నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తలలో సమస్య తీవ్రం కావడంతో మార్చి 5వ తేదీన కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. చిత్తరంజన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. మనిషి ఉన్నా లేనట్లుగా ఉండి పోవడంతో మార్చి 9వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో వైద్యులు, జీవదాన్ ట్రస్టు.. అతడి కుటుంబ సభ్యులకు అవయవదానంపై ఆవశ్యకత, అవగాహన కల్పించారు. అవయవదానం చేయాలని జీవన్ దాన్ సిబ్బంది కోరడంతో చిత్తరంజన్‌రెడ్డి కుటుంబ సభ్యులు పెద్ద మనసు చేసుకుని అవయవ దానానికి అంగీకరించారు. దీంతో అతని రెండు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు తీసి జీవన్‌దాన్ ద్వారా భద్రపరిచారు. అవయవాల దానం ద్వారా నలుగురికి ప్రాణదానం చేసినట్లయ్యిందని వైద్యులు తెలిపారు. అనంతరం స్వగ్రామం కాకుల కొండారంలో ఆంత్యక్రియలు నిర్వహించారు. చిత్తరంజన్ రెడ్డి భౌతికంగా లేకున్నా అతని అవయవాల వితరణతో మరో నలుగురిలో జీవించే ఉంటాడని స్థానికులు కొనియాడారు. అవయవ దానం చేయడం పట్ల చిత్తరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.