Does Mahila Samman Savings Scheme get more interest than bank?
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ లో బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ వస్తుందా?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మహిళలకు వరంగా మారింది. చిన్న పొదుపు చేస్తే చాలు.. మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంతకీ ఆ పథకం ఏంటి? ఈ బడ్జెట్ లో దాని ప్రస్తావన ఏమైనా ఉంటుందా?
మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా పొదుపు పథకాలను ప్రవేశ పెడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
2023 బడ్జెట్‌లో కేంద్రం మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్' ను ప్రవేశపెట్టింది. ఈ పొదుపు పథకంలో రెండు సంవత్సరాల లాక్-ఇన్ బ్యాంక్ FD కంటే ఎక్కువ రాబడి వస్తుంది. మహిళా సమ్మాన్ పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టడానికి గడువు ఈ ఏడాది మార్చి 31 తో ముగుస్తుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీం ప్రయోజనాలు:
వడ్డీ రేటు 7.5%
మహిళా సమ్మాన్ పొదుపు పథకంలో జమ చేసిన డబ్బుపై ఏడాదికి 7.5% వడ్డీ లభిస్తుంది. వడ్డీ ప్రతి మూడు నెలలకి ఒకసారి లెక్కించడం ఇందులో ప్రత్యేకం. ఇది ఖాతాలో జమ అవుతుంది. మెచ్యూరిటి సమయంలో మొత్తం వడ్డీని అసలుతో కలిపి చెల్లిస్తారు. ఈ పథకంలో ఇచ్చే వడ్డీ ప్రస్తుతం రెండు సంవత్సరాల బ్యాంక్ FD కంటే ఎక్కువ.
ప్రస్తుతం SBI రెండు సంవత్సరాల FDపై సాధారణ ఖాతాదారులకు 6.80%, సీనియర్ సిటిజన్లకు 7.30% వడ్డీని అందిస్తోంది. అంతే సమయంలో, HDFC బ్యాంక్ సాధారణ ఖాతాదారులకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.5% వడ్డీని అందిస్తోంది.
ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?
మహిళా సమ్మాన్ పొదుపు పథకంలో ఏ మహిళ అయినా తన పేరు మీద పొదుపు చేసుకోవచ్చు. మైనర్ బాలిక అయితే ఆమె తరపున తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?
ఈ పొదుపు పథకంలో 1,000 రూపాయల నుంచి గరిష్టంగా రూ. 2,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడానికి, దరఖాస్తుదారు ఖాతా తెరిచే ఫామ్, KYC డాక్యుమెంట్లు (ఆధార్, పాన్ కార్డ్) కావాలి. కొత్త ఖాతాదారుల కోసం KYC ఫామ్, చెల్లింపు స్లిప్‌తో పాటు డిపాజిట్ మొత్తాన్నిసమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకులో సమర్పించాలి.
ఈ మార్చి 31తో ఈ స్కీమ్ గడువు ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ పథకం కాలపరిమితిని పొడగిస్తుందా? లేక కొత్తగా మరో పథకం ప్రవేశపెడుతుందా? వేచి చూడాలి.