Do you know what happens if you die after taking a loan?
లోన్ తీసుకున్న తర్వాత చనిపోతే ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా చాలా మంది వారి అవసరాల కోసం ఎక్కడో ఓ చోట అప్పు చేస్తుంటారు. కొందరు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేస్తే, మరికొందరు బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి సడన్ గా చనిపోతే బ్యాంకులు ఏం చేస్తాయి? ఆ డబ్బులు ఎలా వసూలు చేస్తాయి?
ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా డబ్బు అవసరం వస్తూనే ఉంటుంది. అందుకోసం కొందరు వ్యక్తుల దగ్గర మరికొందరు బ్యాంకుల వద్ద అప్పు తీసుకుంటూ ఉంటారు. బ్యాంకు లోన్లు అనేక రకాలుగా ఉంటాయి. అవి పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ తదితరాలు.
బ్యాంకు ఏ వ్యక్తికైనా లోన్ ఇవ్వడానికి ముందు వారి ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తుంది. ఆ వ్యక్తి ఋణం చెల్లించే స్థితిలో ఉన్నారా లేదా అని చెక్ చేస్తుంది. అన్ని విషయాలను ధృవీకరించిన తర్వాత మాత్రమే సదరు వ్యక్తి ఖాతాకు లోన్ అమౌంట్ బదిలీ చేస్తుంది. అయితే, లోన్ తీసుకున్న వ్యక్తి సడన్ గా చనిపోతే బ్యాంకు ఏం చేస్తుంది. డబ్బులు ఎలా వసూలు చేస్తుంది?
బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే.. బ్యాంకు నలుగురు వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేయవచ్చు.
కో-అప్లికెంట్
లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత బ్యాంకు మొదట కో-అప్లికెంట్‌ను సంప్రదిస్తుంది.
గ్యారెంటర్
కో-అప్లికెంట్ లోన్ కట్టకపోతే, బ్యాంకు గ్యారెంటర్‌ను పట్టుకుంటుంది. వారి నుంచి బకాయి వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంది.
చట్టపరమైన వారసుడు
అనేక సందర్భాల్లో గ్యారెంటర్ కూడా లోన్ చెల్లించలేరు. అప్పుడు బ్యాంకు మృతుని కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన వారసుడిని సంప్రదిస్తుంది.
మృతుని ఆస్తి
ఒకవేళ ఎవరూ ఋణం చెల్లించకపోతే, చివరికి బ్యాంకు మృతుని ఆస్తిని స్వాధీనం చేసుకుని, దానిని అమ్మి లోన్ అమౌంట్ వసూలు చేస్తుంది.
హోం లోన్- కార్ లోన్
ఒక వ్యక్తి హోం లోన్ లేదా కార్ లోన్ తీసుకున్నాక సడెన్ గా చనిపోతే.. బ్యాంకు ఆ ఇల్లు లేదా కారును స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత వాటిని వేలం వేసి డబ్బులు సెటిల్ చేస్తుంది.
సురక్షిత, బీమా చేసిన లోన్
బ్యాంకు సురక్షిత లోన్ ఇస్తే.. ఆస్తి లేదా ఏదైనా వస్తువును స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది. ఒకవేళ లోన్ కి ఇన్సూరెన్స్ ఉంటే, బ్యాంకు నామినీ సంతకం తీసుకుని బీమా సంస్థ నుంచి డబ్బు వసూలు చేస్తుంది.
అసురక్షిత రుణం
అన్ సెక్యూర్డ్ లోనుకు ఎవరూ బాధ్యత వహించరు. కానీ బ్యాంకులు ఇప్పటికీ మృతుని బంధువుల నుంచి వీలైనంత డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తాయి. పర్సనల్ లోన్ కూడా ఒక రకమైన అన్ సెక్యూర్డ్ లోన్. దీనిలో ఎటువంటి హామీ లేకుండానే డబ్బు ఇస్తారు. రుణగ్రహీత అకస్మాత్తుగా మరణిస్తే, బ్యాంకులకు లోన్ వసూలు చేయడానికి ఎటువంటి మార్గం ఉండదు.
ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి వ్యక్తిగత రుణం తీసుకుంటే.. వారిలో ఒకరు మరణిస్తే, కో- అప్లికెంట్.. బకాయి మొత్తానికి బాధ్యత వహిస్తారు. అయితే ఇద్దరు అప్లికెంట్లు ఒకేసారి ప్రమాదంలో మరణిస్తే, లోన్ వసూలు చేయడానికి బ్యాంకుకు ఎలాంటి మార్గం ఉండదు.
టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం?
సాధారణంగా బ్యాంకులు లోన్ తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించవచ్చు. అలాంటి పరిస్థితిలో వారి కుటుంబం చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని నివారించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తద్వారా మరణం సంభవించినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే డబ్బుతో లోన్ చెల్లించవచ్చు.