WARANGAL MAMUNUR AIRPORT
వరంగల్‌కు గుడ్‌న్యూస్ - మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్.
వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్రం అనుమతి - త్వరగా పనులు చేపట్టాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీని ఆదేశించిన రామ్మోహన్‌నాయుడు
Central Government Green Signal To Warangal Mamnoor Airport Development : వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కి కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 150 కి.మీ పరిధిలో మరో ఎయిర్‌పోర్ట్ ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జీఎంఆర్ అంగీకారం తెలిపింది. జీఎంఆర్ అంగీకారం తెలపడంతో మామునూరు ఎయిర్‌పోర్ట్ పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని కేంద్రమంత్రి ఆదేశించారు.
ఇక ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు కల సాకారమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఎయిర్‌పోర్టు పనులు వేగవంతమవుతాని ఆయన అన్నారు. ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతి తెలపడం పట్ల మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖలు :
వరంగల్ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరునుందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలసి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖలు అందజేసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
భారత్, చైనా యుద్ధ టైంలో కీలక సేవలు :
మామునూరు ఎయిర్‌పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్‌పోర్టు కట్టడానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కి.మీ. ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది.
ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్‌వే విస్తరణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), టెర్మినల్ బిల్డింగ్, నేవిగేషన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వివరించింది. నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ టైంలో కీలక సేవలు అందించాయి. సుమారు 32 సంవత్సరాల కిందట మూతపడిన మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ ‘రెక్కలు’ రానున్నాయి. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడుస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్ నుంచి మళ్లీ విమానం ఎగరనుంది.