Army jawan with Mothers's photo in Tirumala..
తిరుమలలో అమ్మ ఫోటోతో ఆర్మీ జవాను.. అతని బాధ విని చలించిన భక్తులు!
తిరుపతి కలెక్టరేట్‌లో ఒక ఆర్మీ జవాన్ తన తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లాడు. అమ్మ అడ్రస్ తెలుసుకునే ప్రయత్నంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం మెట్లు ఎక్కిన ముత్తు అనే ఆర్మీ జవాన్ అక్కడ కనిపించిన వారందరినీ అడిగాడు. అమ్మ పోటో చూపిస్తూ ఆరా తీశాడు. ఒక వైపు అమ్మ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం, మరోవైపు దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో చేయాల్సిన ఉద్యోగం ఈ రెండే ఆ జవాన్ ముందున్న లక్ష్యాలు కావడం తో మదురై నుండి టెంపుల్ సిటీ తిరుపతికి చేరుకున్నాడు ముత్తు.
ఓం శక్తి మాల ధరించి 100 మంది భక్త బృందంతో గత జనవరి 10న తమిళనాడులోని మధురై జిల్లా సలుప్పపట్టి గ్రామం నుంచి తిరుమల యాత్ర కు వచ్చిన తల్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ముత్తు తల్లి జాడ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తిరుమలకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తిరుమల వన్ టౌన్ పీఎస్ లో 67 ఏళ్ల వెళ్ళైతాయి అదృశ్యం పై మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
కాగా ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ముత్తు తల్లి కదలికలను పరిశీలించిన అడవి బాటపట్టినట్లు సీసీ కెమెరా విజువల్స్‌లో గుర్తించారు. ఈ మేరకు తల్లి చివరి దృశ్యంతో ఆచూకీ లభిస్తుందని ప్రయత్నిస్తున్న ఆర్మీ జవాన్ ముత్తు తిరుమలలోని డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి అక్కడున్న వారిని విచారించాడు. తల్లి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో వచ్చిన జవాన్ ముత్తు ఆవేదనను ఎవరు కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆమె అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీ పుటేజీ స్పష్టం చేస్తుండటంతో అమ్మ ఆచూకీ లభిస్తుందన్న ఆశతోనే ముత్తు ప్రయత్నం చేశాడు.
అయితే టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు తీరు అతన్ని బాధించింది. పోలీసుల సహకారంతో మళ్లీ అక్కడికే వెళ్లి ఆరా తీసిన ప్రయోజనం లేకపోయింది. అనుమానాస్పదంగా అక్కడ కనిపించిన వెళ్ళైతాయి విషయాన్ని ఎందుకు తమ దృష్టికి తీసుకుని రాలేదని ప్రశ్నించిన పోలీసులకు కూడా అక్కడి టీటీడీ సిబ్బంది నిర్వాకం నచ్చకపోగా, ఇక జవాన్ ముత్తుకు తల్లి ఏమైందన్న అదోళన ఎక్కువైంది. తల్లి ఎక్కడికెళ్ళిందన్న దానిపై స్పష్టత రాకపోతోంది. ఆచూకి కోసం ఫోటోతో వచ్చిన కొడుకు ముత్తుకు తాము చూశామని కూడా చెప్పని టీటీడీ సిబ్బంది ఎందుకు నిజం దాచారని నిలదీసిన పోలీసులకు ఎలాంటి సమాధానం రాకపోయింది. దీంతో పోలీసుల నుంచి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వన్యప్రాణులు దాడి చేసిందేమోనని అనుమానం పోలీసుల నుంచి వ్యక్తం అవుతోంది.
తన తల్లిని అడవి జంతువు బలి తీసుకుని ఉంటే కనీస ఆనవాళ్లు అయినా ఉండాలి కదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్న జవాన్ ముత్తు తల్లి ఆచూకి తెలిస్తే చెప్పండి అంటూ సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నాడు. సెలవులు ముగిసినా నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్ళలేక, ఇటు తల్లి ఆచూకీ కానరాక తల్లి కోసం తల్లడిల్లుతున్నాడు. కానరాని తల్లి కోసం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కూడా కలిసిన జవాన్ ముత్తు, తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో తల్లి మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకోమని పిర్యాదు చేయమని విన్నవించాడు. ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలుస్తానని చెబుతున్నాడు.