Worked for 20 years after getting off the train to drink tea..!
కొంపముంచిన ఛాయ్.. టీ త్రాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ..!
బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి 20 ఏళ్లుగా కూలీ, నాలీ లేకుండా వెట్టిచాకిరీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత రెండు రోజుల క్రితం తమిళనాడులో కార్మిక శాఖ అధికారులు పలు వ్యాపార రంగ సంస్థలపై దాడులు నిర్వహించారు. అలా చేసిన దాడుల్లో అప్పారావు అనే ఒక వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. 20ఏళ్లుగా వెట్టిచాకిరీలో మగ్గుతున్నాడని గుర్తించారు కార్మిక శాఖ అధికారులు.
పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన జాతాపు ఆదివాసి తెగకు చెందిన అప్పారావు అనే వ్యక్తి గత 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం తన గ్రామానికి చెందిన పలువురితో కలిసి రైలులో పాండిచ్చేరి బయలుదేరాడు. అలా రైలు తమిళనాడులోకి ప్రవేశించిన తర్వాత మార్గమధ్యలో ఒక స్టేషన్‌లో ఆగింది. అప్పారావు టీ తాగేందుకు ట్రైన్ నుండి క్రిందకు దిగాడు. టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ త్రాగి తిరిగి స్టేషన్ కు వచ్చి చూసేసరికి ట్రైన్ కనిపించలేదు. అధికారులను అడగ్గా ట్రైన్ వెళ్లిపోయిందని సమాధానం వచ్చింది. అయితే అప్పారావు వద్ద డబ్బులు లేకపోవడంతో ఎటు వెళ్లాలో, ఏమి చేయాలో తెలియక అక్కడే ఉండిపోయాడు.
రెండు రోజులు అటూ ఇటూ తిరిగి ఏం చేయాలో పాలుపోక తినటానికి తిండి కోసం తమిళనాడులోని ఓ వ్యక్తి వద్ద గొర్రెల కాపలాదారుడిగా పనిలో జాయిన్ అయ్యాడు. అలా జాయిన్ అయిన అప్పారావుకు కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దనే ఉంచుకున్నాడు యజమాని. అప్పారావు బయటికి వెళితే తిరిగి రాడేమోనని ఉద్దేశ్యంతో ఆ ప్రదేశం నుండి బయటకు కూడా వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.
అలా దాదాపు 20 ఏళ్లు వెట్టిచాకిరీ చేస్తూ అక్కడే ఉండిపోయాడు అప్పారావు. అయితే ఇటీవల శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో అప్పారావు వారి కంటపడ్డాడు. అప్పుడు అధికారులు అప్పారావుతో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని అధికారులకు తెలియజేశాడు అప్పారావు. వెంటనే తమిళనాడు కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు అప్పారావు ఫోటో పంపించి వివరాలు తెలియజేశారు. వెంటనే కలెక్టర్ శ్యాం ప్రసాద్ పోలీసులకు ఫోటో అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని ఆదేశించాడు.
దీంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు జమ్మవలస గ్రామానికి వెళ్లి అప్పారావు ఫోటో చూయించి ఆరా తీయగా అలాంటి వారెవరు తమకు తెలియదని, ఎప్పుడు చూడలేదని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో అప్పారావు ఆచూకీ కోసం పార్వతీపురం మన్యం జిల్లాలోనే మరికొన్ని గ్రామాల్లో వెదకడం ప్రారంభించారు. అప్పారావు ఆచూకి తెలిసిన వారు తమకు తెలియజేయాలని పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం అప్పారావు మధురై లోనే ఓ వసతిగృహంలో ఉంచారు అధికారులు. అయితే అప్పారావు చెప్పినట్లే పార్వతీపురం మన్యం జిల్లా వాసేనా? లేక తన అడ్రస్ మర్చిపోయి తప్పుగా చెప్తున్నాడా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఇరవై ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసి అంధకారం నుండి బయటకు వచ్చిన అప్పారావు ఇప్పటికైనా కుటుంబ సభ్యులను కలుస్తాడా? లేదా? అన్నది అందరిలో ఉత్కంఠతను పెంచుతుంది..