BS MS DUAL DEGREE WITH STIPEND
విద్యార్థులకు బంపరాఫర్ - డిగ్రీ చేస్తూనే డబ్బులు సంపాదించుకోండిలా!
పేరున్న సంస్థల్లోడ్యూయల్ డిగ్రీ! - బీఎస్, ఎంఎస్‌లో సీటొస్తే ప్రతి నెలా స్టైపెండ్ -
BS and MS Dual Degree With Stipend : మీరు ఇంటర్ విద్యార్థులా? మ్యాథ్స్, సైన్స్, డేటాసైన్స్, ఎకనామిక్స్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఉన్నత విద్య, పరిశోధనల్లో రాణించాలని అనుకుంటున్నారా? అయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)ల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ సంస్థలు అందించే ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్ (డ్యూయల్ డిగ్రీ) కోర్సులు ఎంతో ముఖ్యం. వీటిలో ప్రవేశానికి ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. సీటు వచ్చిన వారు ప్రతి నెలా స్టైపెండ్ అందుకోవచ్చు.
కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో బరంపురం, తిరుపతి, మొహాలీ, భోపాల్, పుణే, కోల్‌కతా, తిరువనంతపురంలో ఐఐఎస్‌ఈఆర్‌లు ఏర్పాటు అయ్యాయి. నాణ్యమైన బోధన, లైబ్రరీ, అత్యాధునిక ల్యాబ్‌లు, వసతి సౌకర్యాలు ఈ సంస్థల నుంచి ఆశించవచ్చు. ఇక్కడ ఐదు సంవత్సరాల వ్యవధి ఉండే బీఎస్-ఎంఎస్ కోర్సుల్లో చేరినవారికి మొదటి రెండు సంవత్సరాలు సైన్స్‌లో ప్రాథమికాంశాలు బోధిస్తారు. 3, 4 సంవత్సరాల్లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు. ఐదో సంవత్సరం ఆర్ అండ్ డీ… సంస్థలు, సైన్స్ అంశాలతో ముడిపడి ఉన్న పరిశ్రమలను సందర్శిస్తారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ మొదటి రెండు సంవత్సరాలు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీలతోపాటు కొన్ని హ్యుమానిటీస్ కోర్సులు, ఆర్ట్, ఎర్త్‌సైన్స్‌లు అభ్యసిస్తారు. కోర్సు మొత్తం 10 సెమిస్టర్లు ఉంటాయి.
కోర్సులు ఇవీ : -
బీఎస్ - ఎంఎస్ : కెమికల్ సైన్సెస్, బయలాజికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్సెస్ / జియలాజికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.
బీఎస్ కోర్సులు (భోపాల్‌లోనే) : ఇంజినీరింగ్ సైన్సెస్ (డేటా సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్), ఎకనామిక్స్ సైన్సెస్. వ్యవధి నాలుగు సంవత్సరాలు. బీఎస్ కోర్సులకు ఎంపీసీ విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎకనామిక్స్ కోర్సులో చేరినవారు బీఎస్ తరువాత మరో సంవత్సరం చదువు పూర్తి చేసుకుంటే ఎంఎస్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
ఐఐఎస్‌ఈఆర్, కోల్‌కతాలో ఈ సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల బీఎస్-ఎంఎస్ కంప్యుటేషనల్ అండ్ డేటా సైన్సెస్ కోర్సు ప్రారంభం చేస్తున్నారు. అలాగే ఐఐఎస్‌ఈఆర్, తిరుపతిలోనూ నాలుగు సంవత్సరాలు బీఎస్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ కోర్సు మొదలవుతోంది.
బీఎస్-ఎంఎస్ సీట్లు : ఐఐఎస్‌ఈఆర్ : భోపాల్- 300, తిరుపతి- 350, బరంపురం- 300, కోల్‌కతా- 310, మొహాలీ- 270, పుణె- 288, తిరువనంతపురం- 320. వీటితో పాటు భోపాల్‌లో బీటెక్‌లో 140, బీఎస్‌లో 35 సీట్లు ఉన్నాయి. తిరుపతిలో బీఎస్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ కోర్సులో యాభై మందిని తీసుకుంటారు. 7 సంస్థల్లోనూ అన్ని కోర్సుల్లోనూ 2363 సీట్లను ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఐఏటీ)తో భర్తీ చేస్తారు.
ఐఐఎస్సీ, బెంగళూరు అందించే బీఎస్ (రిసెర్చ్), ఐఐటీ మద్రాస్‌లోని బీఎస్-మెడికల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ ప్రోగ్రాంలో చేరాలనుకున్నవారు ఐఏటీ రాయాలి. ఈ స్కోరుతోనే ఆ సంస్థలకు అప్లై చేసుకోవాలి.
ఐఏటీ ఇలా : -
కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ ఒక్కో సబ్జెక్టులో 15 చొప్పున 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నలు అన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రశ్నలు అన్నీ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు.
ముఖ్య వివరాలు :-
అర్హత : ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుతో 2023/ 2024/ 2025లో 60 (ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు 55) శాతం మార్కులతో ఇంటర్.
ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు తేదీ : వచ్చే నెల 15, 2025.
దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1000. మిగిలిన అందరికీ రూ.2000.
ఆప్టిట్యూడ్ పరీక్ష : మే 25.
మరిన్ని వివరాలకు https://iiseradmission.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.