HOW TO PAY LRS FEE IN TELANGANA
మీ ఫోన్ నుంచే LRS ఫీజు చెల్లించండి - ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోండి.
ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపునకు అవకాశం - మార్చి 31లోపు తగిన రుసుములు చెల్లించాలని సూచన
How to Pay Telangana LRS Fee From Phone : ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. మార్చి 31లోపు తగిన రుసుములు చెల్లించి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవాలని సూచనలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే దరఖాస్తుదారుల్లో ఇప్పటికీ ఒకింత అయోమయం నెలకొని ఉందని సమాచారం. ఎక్కడికి వెళ్లాలి, ఎంత రుసుము కట్టాలి, ఎలా చెల్లించాలనే విషయాల్లో తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. ఈ గందరగోళం ఏమీ లేకుండా ఉన్న చోట నుంచే రుసుము చెల్లించేలా అధికారులు అవకాశం కల్పించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌ను ఎలా చెల్లించాలంటే :
- కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగించేది ఏదైనా అంతర్జాల సదుపాయం ఉంటే రుసుము చెల్లింపునకు మార్గం సులభం అవుతుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ 2020 అని టైప్ చేయాలి.
- అక్కడ welcome to LAYOUT REGULARIZATION SCHEME (LRS) పై క్లిక్ చేయొచ్చు. లేదా https:s.telangana.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
- అక్కడ హోం పేజీలో సిటిజన్ లాగిన్‌ను ఎంచుకోవాలి.
- అందులో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు టైంలో మనం ఇచ్చిన సెల్ ఫోన్ నంబరును నమోదు చేయాలి.
- ఓటీపీ కోసం అభ్యర్థించగానే సెల్ఫోల్కి ఓటీపీ వస్తుంది.
- దాన్ని అక్కడ నమోదు చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి.
- తదనంతరం ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్స్ ఫీ పేమెంట్‌ను ఎంచుకోవాలి.
- వివరాలు సరి చూసుకొని ముందుకు సాగేందుకు ప్రొసీడ్‌ను క్లిక్ చేయాలి.
- మన ప్లాట్‌కు సంబంధించిన వివరాలు అన్నీ అక్కడ పరిశీలించుకొని కిందకు వస్తే మనం చేయాల్సిన పేమెంట్ వివరాలు కనిపిస్తాయి.
- స్వీయ ధ్రువీకరణకు సంబంధించిన అన్ని అంశాలను అంగీకరిస్తూ పేమెంట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
- అక్కడ క్యూఆర్ కోడ్‌ను చూపించే బటన్‌ను నొక్కాలి.
- ఆ తరువాత మన సెల్‌ఫోన్ నంబరు నమోదు చేయాలి.
- కంటిన్యూ అండ్ పే క్లిక్ చేయాలి.
- గూగుల్‌పే, ఫోన్‌పే ఆధారంగా అక్కడ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి నగుదు చెల్లించాలి.
- పేమెంట్ విజయవంతం అయితే ఆ రసీదును డౌన్లోడ్ చేసుకోవాలి.
అధికారుల కసరత్తు : ఈ విధానంపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా పంచాయతీ కార్యదర్శులు ఇందులో భాగం అవుతున్నారు. సంబంధిత దరఖాస్తులు, అందులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేసి వివరాలు అందిస్తున్నారు. నిషేధిత జాబితా, నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, శిఖం భూముల్లో ఉన్నవి, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవి ఇలాంటి సమస్యాత్మక దరఖాస్తులు కాకుండా ఎలాంటి ప్రతికూలతలు లేని ప్లాట్ల విషయంలో అధికారులు ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ తరహా దరఖాస్తుల విషయమై ఇప్పటికే అధికారులకు వచ్చిన జాబితా ఆధారంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.