HUGE PROFITS FROM MULBERRY CROP
ఓ రైతుకు వచ్చిన ఆలోచన - ఆ ఊరి 'బతుకు చిత్రాన్నే' మార్చేసింది.
ఓ ఊరి ముఖచిత్రాన్నే మార్చేసిన మల్బరీ పండ్ల సాగు - మల్బరీ పండ్ల సాగుతో అధిక లాభాలు ఆర్జిస్తున్న రంగారెడ్డి జిల్లా రైతులు - మల్బరీలో అంతరపంటలుగా జామ, బొప్పాయి, సీతాఫలం సాగు
Huge Profits From Mulberry Fruits Cultivation : అదో చిన్న ఊరు. అక్కడి రైతులకు వర్షాలే ఆధారం. అప్పులు చేసి పంటలు వేసినప్పటికీ చేతికొచ్చే వరకు గ్యారంటీ లేదు. ఈ పరిస్థితులతో తరాలుగా అన్నం పెట్టిన పొలాలను వదిలేశారు ఆ రైతన్నలు. కొందరు భూములనే అమ్ముకున్నారు. మరికొందరు హైదరాబాద్ నగర బాట పట్టారు. ఇదీ రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం సరస్వతిగూడలో రైతుల ఒకప్పటి దయనీయ పరిస్థితి. ఒక రైతు తన పొలంలో నాటిన కొమ్మ ఆ ఊరు ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేసింది. అదే రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఆయన నాటింది ఏంటో తెలుసా? మల్బరీ కొమ్మ. అదే ఊరంతటికీ ఉపాధి చూపుతోంది. మల్బరీతో పట్టు పురుగుల పెంపకం చేపడతారు. పండ్లేంటి అనుకుంటున్నారా!
సరస్వతి గూడలో తోట
ఇలా మొదలైంది :
సరస్వతిగూడకు చెందిన కాలువ సత్తయ్య అనే వ్యక్తి 15 ఏళ్ల కిందట బార్కాస్ వెళ్లినప్పుడు అక్కడ మల్బరీ పండ్ల అమ్మకాన్ని గుర్తించారు. వాటి రుచి చూసిన ఆ వ్యక్తి ఇష్టపడ్డారు. ఓ వ్యాపారి నుంచి మల్బరీ కొమ్మను తెచ్చి తన వ్యవసాయ పొలంలో నాటారు. అది నాటుకుని మొక్కగా ఎదిగి పండ్లు కాయడంతో వాటిని బార్కాస్‌కే తీసుకెళ్లారు. వాటికి మంచి ధర పలకడంతో క్రమంగా సాగును విస్తరించారు. పండ్లకు డిమాండ్ బాగుండటం వల్ల తోటి రైతులనూ ప్రోత్సహించారు. ప్రస్తుతం ఆ ఊరిలో మల్బరీ మొక్కలేని పొలం, ఇల్లు ఉండదంటే నమ్మండి. ప్రతి రైతు అర ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మల్బరీ సాగు చేస్తున్నారు. గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణానికి పైగా ఈ తోటలున్నాయి.
నిత్యం 10 క్వింటాళ్ల వరకు దిగుబడి :
తీపి, పులుపు కలిసిన కమ్మటి రుచితో ఉండే ఈ పండ్లకు హైదరాబాద్‌లో గిరాకీ ఎక్కువగా ఉంది. వీటిని ఉదయం 9 గంటల్లోపే కోస్తారు. కూలీలకు గంటకు రూ.50 చొప్పున చెల్లిస్తున్నారు. గరిష్ఠంగా కిలో రూ.250లకు పైగా వస్తుంది. ప్రస్తుతం వీటి ధర రూ.100-150 ఉంటోంది. వ్యాపారులే గ్రామానికి వచ్చి నిత్యం 8-10 క్వింటాళ్ల పండ్లను కొంటున్నారు. అలా ఖరీదు చేసిన వాటిని బార్కాస్, మొజాంజాహి మార్కెట్లకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షన్నర చొప్పున ఏడాదికి రూ.4-5 కోట్ల వరకు వ్యాపారం సాగుతోందని రైతులు చెబుతున్నారు. మల్బరీలో అంతర పంటలుగా జామ, బొప్పాయి, సీతాఫలాన్ని సాగు చేస్తున్నారు.
పది నెలల్లోనే కాత :
ఈ మల్బరీ సాగుకు విత్తనాలు ఉండవు. వాటి కొమ్మలనే నాటుతున్నారు. అవి 10 మాసాల్లో మొక్కలుగా ఎదిగి కాతకొస్తున్నాయి. ఒక్క మొక్క చెట్టు నుంచి సగటున రోజుకు రూ.500 వరకు ఆదాయం పొందవచ్చని, అర ఎకరంలో సాగుచేస్తే రోజుకు 40-50 కిలోల వరకు దిగుబడి వస్తుందని రైతులు వివరిస్తున్నారు. ‘ఇవి అన్ని కాలాల్లో కాస్తాయి. వర్షాలు అధికంగా ఉంటే దిగుబడులు తగ్గుతాయి. పట్టు పురుగుల పెంపకానికైతే మాత్రం ఆకులను తెంపకూడదు. పండ్లను పొందాలంటే ప్రతి మొక్క చెట్టు ఆకులను 45 రోజులకు ఒకసారి తీసేయాల్సి ఉంటుంది. వాటినే చెట్ల మొదళ్లలో వేస్తే అదనంగా ఎరువుల అవసరం ఉండదు' అని స్థానిక వ్యవసాయాధికారి ఒకరు తెలిపారు.