What the young man's friends did after his death
స్నేహమంటే ఇదేరా..! యువకుడి మరణం తర్వాత అతని ఫ్రెండ్స్ చేసిన పని తెలిస్తే శభాష్ అంటారు!
ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తమ స్నేహితుడి జ్ఞాపకార్థం, అతని స్నేహితులు వందకు పైగా వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే తమ స్నేహితుడు మరణించాడని గుర్తు చేసుకుని, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజ సేవ ద్వారా స్నేహితుడికి నివాళి అర్పించిన వారిని అందరూ అభినందిస్తున్నారు.
స్నేహమంటే మనిషి మనతో ఉన్నప్పుడే కాదు, అతను లేనప్పుడు కూడా ఏదో ఒక విధంగా అతనిపై ప్రేమాభిమానాలు చూపించాలి. అతని కోసం చేసే పని ప్రతిసారీ అతనికే ఉపయోగపడాల్సిన అవసరం లేదు, సమాజానికి మేలు చేసే ఏ పనైనా స్నేహం పేరుతో చేస్తే అదే ఆ స్నేహానికి స్నేహితులు ఇచ్చే గొప్ప బహుమతి. తాజాగా కొంతమంది వ్యక్తులు తమ స్నేహితుడు చనిపోతే, అతని జ్ఞాపకార్థంగా మంచి పని చేశారు. చాలా మంది చనిపోతే దినాలు చేసి, ప్లేట్లు, బాక్సులు వంటి వస్తువులు జ్ఞాపకార్థంగా ఇస్తుంటారు. కానీ, వీళ్లు మాత్రం సమాజానికి ఉపయోగపడుతూ, మరికొందరి ప్రాణాలు కాపాడాలే హెల్మెట్లు పంచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.
అయితే హెల్మేట్ లేక తమ స్నేహితుడు తమకు దూరమయ్యాడని గుర్తించిన మృతుని స్నేహితులు ముమ్మిడివరం లో వాహనదారులుకు ఉచితంగా హెల్మెట్ లు పంపిణీ చేశారు. ముమ్మిడివరం మండలం కర్రివాణిరేవు పంచాయతీ పరిది బూరుగుపేటకు చెందిన మట్టా ఆకాష్ రెడ్డి ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ప్రమాదం లో తలకి తీవ్ర గాయలవడంతో ఆకాష్ రెడ్డి మృతి చెందాడు. హెల్మెట్ ఉంటే అతడు బ్రతికేవాడని గుర్తించిన స్నేహితులు ముమ్మిడివరం లో ప్రధాన రహదారి చెంత వంద మంది వాహదారులకు పైగా హెల్మెట్లు పంచే కార్యక్రమం నిర్వహించారు. మా స్నేహితుడి విషయంలో జరిగింది, మరో కుటుంబానికి జరగకూడదని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలంటూ తమ స్నేహితుడి ఫోటో వేసి… మెసేజ్ పాస్ చేస్తూ హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన మృతుడి స్నేహితులను పలువురు అభినందిస్తున్నారు.