FAMILY ENDS LIFE IN TAMILNADU
'రూ.50లక్షలు మోసపోయా- ఎవరికీ చెప్పే ధైర్యం లేదు'- ఇంట్లోని నలుగురూ మృతి!
ఆన్‌లైన్‌లో స్కాంలో రూ.50 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి- భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణం
Family Ends Life In Tamil Nadu : తమిళనాడులోని నమక్కల్ పట్టణంలో దారుణం జరిగింది. ఆన్‌లైన్ స్కాంలో రూ.50 లక్షలు పోయాయనే మనస్థాపంతో ప్రేమ్ రాజ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమ్‌రాజ్ ఆచూకీ కనిపించక
వివరాల్లోకి వెళ్లితే, ప్రేమ్‌రాజ్ ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఒక ప్రైవేటు బ్యాంకులోని జీవిత బీమా విభాగంలో పనిచేసేవాడు. నమక్కల్-సాలెం రోడ్డులోని పథి నగర్‌లో ఓ అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. మంగళవారం (మార్చి 4న) ఉదయం ప్రేమ్‌రాజ్ భార్య మోహన ప్రియ, కుమార్తె ప్రిణిథి రాజ్, కుమారుడు ప్రిణిస్ రాజ్ మృతదేహాలను వారి ఇంట్లోని బెడ్‌రూంలో గుర్తించారు. వాటిని పోస్టుమార్టం కోసం పంపించారు. ఒక సూసైడ్ లెటర్ పోలీసులకు దొరికింది. ప్రేమ్ రాజ్, మోహన ప్రియ దంపతులు వినియోగించిన రెండు ఫోన్లను జప్తు చేశారు. ప్రేమ్ రాజ్ ఆచూకీ కనిపించకపోవడం వల్ల అతడిని వెతికేందుకు రెండు ప్రత్యేక టీమ్‌లను నమక్కల్ ఏఎస్పీ ఆకాశ్ జోషి ఏర్పాటు చేశారు. ప్రేమ్ రాజ్ వద్ద గతంలో బహుశా రెండు ఫోన్లు ఉండొచ్చని, వాటిలోనే ఒకదాన్ని ఇంట్లో వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు టీమ్‌లు ఎట్టకేలకు కరూర్ సమీపంలోని పశుపతి పాలాయం వద్ద ప్రేమ్ రాజ్ డెడ్‌బాడీని గుర్తించాయి. దీంతో ప్రేమ్ రాజ్ బతికి ఉండొచ్చని అప్పటిదాకా భావించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.
రూ.65 లక్షల కోసం- రూ.6 లక్షలు అప్పు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రేమ్‌రాజ్ భార్య మోహన ప్రియ కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ప్రేమ్‌రాజ్ ఇంటి ఇరుగుపొరుగున ఉండే వారితోనూ మాట్లాడారు. "ప్రేమ్‌రాజ్ వారం క్రితం నా దగ్గర రూ.6 లక్షలు అడిగాడు. త్వరలోనే తనకు రూ.65 లక్షలు వస్తాయన్నాడు. ఆ డబ్బు రాగానే అప్పును తిరిగి చెల్లిస్తానన్నాడు. ఆ మాటలు నమ్మి నేను రూ.6 లక్షలు ఇచ్చాను" అని మోహన ప్రియ తండ్రి షణ్ముగం పోలీసులకు చెప్పారు. ఈ డబ్బులు తీసుకున్న మరుసటి రోజు (మార్చి 4న) ఉదయంకల్లా ప్రేమ్ రాజ్ కుటుంబంతో సహా బలవన్మరణాలకు పాల్పడ్డారు.
సూసైడ్ లెటర్‌లో
"ప్రేమ్‌రాజ్ అనే నేను ఒక ఆన్‌లైన్ స్కాంలో ఇరుక్కొన్నాను. మొత్తంగా రూ.50 లక్షలు పోగొట్టుకున్నాను. గత పదిరోజుల్లోనే ఇదంతా జరిగింది. దీన్ని ఎవరికీ చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే మేమంతా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి" అని సూసైడ్ లెటర్‌లో ప్రేమ్‌రాజ్ రాశారు. ఈ లేఖలో నలుగురు కుటుంబ సభ్యుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి.